Ukraine Crisis: రష్యా సైనిక దాడికి ప్రతిగా.. అమెరికా ఆర్థిక యుద్ధం..!

ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు ప్రతిగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. తాజాగా అమెరికా కఠినమైన ఆర్థిక, ఎగుమతి ఆంక్షలను విధించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది.

Updated : 25 Feb 2022 10:50 IST

 రష్యా బ్యాంకులు, టెక్‌ సంస్థల్ని లక్ష్యం చేసుకొన్న అమెరికా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు ప్రతిగా రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. తాజాగా అమెరికా కఠినమైన ఆర్థిక, ఎగుమతి ఆంక్షలను విధించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై పుతిన్‌ను ఏకాకి చేయాలని బైడెన్‌ కార్యవర్గం పిలుపునిచ్చింది. రష్యా ఆంక్షల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శ్వేతసౌధంలో ఒక ప్రకటన చేశారు. ‘‘మేము ఇప్పుడు ఈ కఠిన ఆంక్షలతో పుతిన్‌ను ఎదుర్కోకపోతే.. ఆయనకు మరింత ధైర్యం వచ్చేస్తుంది. పుతిన్‌ యుద్ధాన్ని ఎంచుకొన్నారు. దీని పర్యవసానాలను ఆయన.. ఆ దేశం భరించాల్సిందే’’ అని పుతిన్‌ను ఉద్దేశించి బైడెన్‌ వ్యాఖ్యానించారు. మొత్తం 10 రష్యా ఆర్థిక సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలను విధించింది. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించిన వెంటనే రష్యాపై తొలివిడత ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిన్న రష్యా బ్యాంకులను లక్ష్యంగా చేసుకొన్నారు. కానీ, ఈ సారి మాత్రం రష్యా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాల వంటి వాటిపై గురిపెట్టారు.

ఆంక్షలు ఇలా..

అమెరికా మిత్రదేశాలు రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోనున్నాయి. రష్యాపై దీర్ఘకాల ప్రభావం ఉండేలా జాగ్రత్త తీసుకొన్నామని.. అదే సమయంలో అమెరికా మిత్రదేశాలపై స్వల్ప ప్రభావం మాత్రమే పడేలా చూశామని బైడెన్‌ వివరించారు.

ఈ కొత్త ఆంక్షల పరిధిలోని రష్యాలోని దాదాపు 80శాతం బ్యాంకింగ్‌ రంగం వచ్చేట్లు చూశారు. రష్యాలోని అతిపెద్ద బ్యాంకులు అయిన స్బెర్‌ బ్యాంక్‌, వీటీబీ బ్యాంకులు డాలర్లను ఉపయోగించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా చర్యలు తీసుకొన్నారు. దీంతోపాటు వీటీబీ బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి ఆస్తులైనా అమెరికా ఆర్థికవ్యవస్థలో ఉంటే వాటిని స్తంభింపజేస్తుంది. దీంతోపాటు అమెరికన్లు ఆ బ్యాంకులతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌ కూడా వీటీబీ బ్యాంకు ఆస్తులను స్తంభింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది.  ఈ ఆంక్షల ఫలితంగా రష్యాలో వ్యాపారాలకు.. డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్‌లు వినియోగించకుండా అడ్డుకున్నట్లయ్యింది. ఈ రెండు బ్యాంకులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 ఆర్థిక సంస్థలు, వాటి అనుబంధ సంస్థలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రష్యాకు చెందిన ఒలిగార్క్‌లు, వారి కుటుంబ సభ్యులపై కూడా ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకింగ్‌తోపాటు లోహరంగం, టెలి కమ్యూనికేషన్స్‌, రైల్వే సంస్థలు ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి.  రష్యాలోని అతిపెద్ద గ్యాస్‌ సంస్థ అయిన గ్యాజ్‌ప్రొమ్‌ పశ్చిమ దేశాల బ్యాంకుల నుంచి మూలధనం సమీకరించకుండా కొత్త ఆంక్షలు అడ్డుకొన్నాయి.

ఈ సారికి స్విఫ్ట్‌ బ్యాన్‌ ఆగింది..

అమెరికా మిత్ర దేశాల్లో కొన్ని రష్యాను స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి పక్కనపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, ఈ సారికి అమెరికా ఆ ఆంక్షలను అస్త్రంగా ప్రయోగించలేదు. దీనిపై బైడెన్‌ స్పందిస్తూ స్విఫ్ట్‌ నుంచి బహిష్కరణ అస్త్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని.. కానీ, ఐరోపా మిత్రులు ఇప్పుడే దానిని కోరుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంక్షలు స్విఫ్ట్‌ తొలగింపు కన్నా తీవ్రమైనవే అని బైడెన్‌ సమర్థించుకొన్నారు.

ఐరోపా సంఘం అదనపు ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆంక్షల ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఐరోపా సమాఖ్య కూడా రష్యా కట్టడి కోసం యత్నాలను తీవ్రతరం చేసింది. అకారణంగా , అన్యాయంగా చేస్తున్న ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. దీనికి రష్యా పూర్తి బాధ్యత వహించాలంది. దీంతోపాటు రష్యాకు బెలారస్‌ సహకరించడాన్ని వ్యతిరేకించింది. దీంతోపాటు అదనపు ఆంక్షలు విధించేందుకు ఐరోపా సమాఖ్య ఆమోద ముద్ర వేసింది. ఈ సారి ఆంక్షలు రష్యా ఆర్థిక రంగాన్ని, ఇంధన, రవాణా, మిలటరీ-పౌర ప్రయోజనాలకు వాడే సరుకులు, ఎగుమతుల నియంత్రణ, ఎగుమతులకు ఆర్థిక మద్దతు, వీసా పాలసీ, రష్యాలోని కీలక వ్యక్తులు, సరికొత్త లిస్టింగ్‌ విధానంలో మార్పులు వంటివి వీటిల్లో ఉండనున్నాయని ఐరోపా సమాఖ్య పేర్కొంది. బెలారస్‌ను ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ‘‘ఐరోపా సమాఖ్య ఏకతాటిపై ఉందని నిరూపించేలా ఈ భారీ ఆంక్షలకు సభ్యదేశాలు ఈ రాత్రి ఆమోద ముద్ర వేశాయి’’ అని ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డే లెయాన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే తొలి విడత ఆంక్షల్లో 70 శాతం రష్యా బ్యాంకింగ్‌ రంగాన్ని, కీలక ప్రభుత్వ, రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని