US Diplomats: ఉక్రెయిన్‌ను విడిచి వచ్చేయండి.. అమెరికా కీలక ఆదేశాలు

ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అగ్ర దేశం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబాలను వెంటనే స్వదేశానికి చేరుకోవాలని చెప్పింది. ఈ మేరకు విదేశాంగ...

Published : 25 Jan 2022 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబాలను వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యా నుంచి నిరంతర ముప్పు పొంచి ఉందని పేర్కొంది. రాయబార కార్యాలయంలోని సిబ్బంది సైతం స్వచ్ఛందంగా వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అమెరికా పౌరులు కూడా వీలైనంత త్వరగా బయల్దేరాలని కోరింది. ఒకవేళ రష్యా చొరబాటుకు పాల్పడితే.. అటువంటి ఆకస్మిక పరిస్థితుల్లో అమెరికా తన పౌరులను ఖాళీ చేయగలిగే స్థితిలో ఉండదని విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు అమెరికా పౌరులు ఉక్రెయిన్‌కు ప్రయాణించడంపై హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల సమీపానికి వెళ్లొద్దని తాజా హెచ్చరికల్లో పేర్కొంది. అక్కడ అమెరికన్లకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. రష్యా.. కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులతోపాటు యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలను మోహరించిన విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆక్రమించేందుకే రష్యా పావులు కదుపుతోందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా.. రష్యా ఖండిస్తూ వస్తోంది. ‘నాటో’ కూటమిలో ఉక్రెయిన్‌ను చేర్చుకోరాదని, తూర్పు ఐరోపా నుంచి అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు వైదొలగాలని రష్యా డిమాండ్‌ చేస్తుండగా.. అమెరికా తోసిపుచ్చుతోంది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య వరుస సమావేశాలు జరుగుతుండగానే అమెరికా తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని