Ukraine Crisis: ఉక్రెయిన్‌లో అమెరికన్‌ మృతి.. తమ పౌరులకు అగ్రరాజ్యం గట్టి హెచ్చరిక

యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు వెళ్లొద్దని దేశవాసులకు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ఉక్రెయిన్‌లో అగ్ర రాజ్యానికి చెందిన విల్లీ జోసెఫ్ క్యాన్సిల్ మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు...

Published : 29 Apr 2022 23:31 IST

వాషింగ్టన్‌: యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా మరోసారి  హెచ్చరించింది. తాజాగా ఉక్రెయిన్‌లో అగ్ర రాజ్యానికి చెందిన వ్యక్తి విల్లీ జోసెఫ్ క్యాన్సిల్ మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. రష్యాపై యుద్ధంలో పాల్గొనేందుకు ఆ దేశానికి వెళ్లొద్దని అమెరికా రక్షణ విభాగం శుక్రవారం గట్టిగా హెచ్చరించింది. ‘ఉక్రెయిన్‌కు వెళ్లొద్దని అమెరికన్‌లను కోరుతూనే ఉన్నాం. ప్రస్తుతం ఆ దేశం ఓ యుద్ధ క్షేత్రం. రాకపోకలు సాగించాల్సిన ప్రదేశం కాదు’ అని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ ఓ వార్తా సంస్థతో అన్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

జోసెఫ్‌ తల్లి రెబెక్కా కాబ్రేరా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తన 22 ఏళ్ల కుమారుడు ఉక్రెయిన్‌లో ఓ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్‌తో కలిసి పనిచేశాడని, ఈ క్రమంలో సోమవారం ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. అతను మార్చి మధ్యలో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అతడికి భార్య, ఏడాదిలోపు బిడ్డ ఉన్నారు. భార్య బ్రిటనీ క్యాన్సిల్ మాట్లాడుతూ.. తన భర్త ఉక్రెయిన్‌కు వెళ్లి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ఆసక్తి కనబరిచారని, ప్రజలకు సాయం చేయాలనే కాంక్షతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. విల్లీ జోసెఫ్‌ పరోపకార ఉద్దేశాలను అర్థం చేసుకున్నామని.. అయితే, ఉక్రెయిన్‌కు సురక్షిత, ప్రభావవంత మార్గాల్లో మద్దతు ఇవ్వడానికి అనేక దారులు ఉన్నాయని కిర్బీ స్పష్టం చేశారు. అతన్ని ఎలా చంపారనే దానిపై పెంటగాన్‌కు సమాచారం లేదన్నారు.

ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశం తరఫున రష్యాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విదేశీయులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పదుల కొద్దీ దేశాల నుంచి వేలాది మంది వాలంటీర్లు తమ పిలుపునకు స్పందించారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మార్చిలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని