Joe Biden: మా జోలికొస్తే ఏం చేస్తామో చూపించాం.. చైనాకు బైడెన్‌ గట్టి వార్నింగ్‌

ముప్పు ఎదురైనప్పుడు తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతటి తీవ్రమైన చర్యలకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) అన్నారు. నిఘా బెలూన్‌ అంశంలో చైనాకు ఆయన గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

Published : 08 Feb 2023 12:32 IST

వాషింగ్టన్‌: నిఘా బెలూన్‌ ఘటనతో అమెరికా (US), చైనా (China) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden).. డ్రాగన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘స్టేట్‌ ఆఫ్ ది యూనియన్‌’ ప్రసంగంలో బైడెన్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమెరికా (America) కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి బైడెన్‌ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా నిఘా బెలూన్ (Spy Balloon) అంశం సహా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ‘‘అమెరికా ప్రజల ప్రయోజనాలు, ప్రపంచ లబ్ధి కోసం చైనాతో కలిసి పనిచేయడానికి నేను కట్టబడి ఉన్నాను. కానీ, అందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మన సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా చైనా వ్యవహరిస్తే.. మన దేశాన్ని కాపాడేందుకు నేను ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడబోను. ఆ విషయాన్ని గతవారమే స్పష్టం చేశాం (నిఘా బెలూన్‌ కాల్చివేతను ఉద్దేశిస్తూ). చైనాతో మేం పోటీనే కోరుకుంటున్నాం గానీ ఘర్షణలు కాదనే విషయాన్ని ఇప్పటికే ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)కు అర్థమయ్యేలా వివరించా’’ అని బైడెన్‌ వెల్లడించారు.

ఇటీవల అమెరికా (US) గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా చెబుతున్నా... అది గూఢచర్య బెలూన్‌ అని విశ్వసిస్తున్న అమెరికా యుద్ధ విమానాన్ని పంపించి తమ దేశ తీరానికి సమీపంలోని అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూల్చివేసింది. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

‘మేడ్‌ ఇన్‌ అమెరికా’కే ప్రాధాన్యం..

ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని బైడెన్‌ (Biden) ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రపంచంలోనే ఉత్తమ మౌలికసదుపాయాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తాము ‘మేడ్‌ ఇన్‌ అమెరికా’కే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో తయారైన ఉత్పత్తులతోనే అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను కూడా బైడెన్‌ ప్రస్తావించారు. యుద్ధ పరిస్థితులు కొనసాగినన్నాళ్లూ ఉక్రెయిన్‌ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి బైడెన్‌కు ఇది రెండో ప్రసంగం. మొత్తం 73 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన.. దేశంలో ఉద్యోగ కల్పన, ఆర్థిక విధానాలను తదితర అంశాలను ప్రస్తావించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు