Ukraine Crisis: ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సాయానికి సెనెట్‌ ఓకే..!

ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి  సెనెట్‌ ఆమెద ముద్రవేసింది.

Published : 20 May 2022 13:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి  సెనెట్‌ ఆమెద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లును 86-11 ఓట్లతో పాస్‌ చేసింది. ఈ బిల్లు ప్రకారం సైనిక, మానవీయ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందనుంది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు నిర్ణయించుకొన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సెనెట్‌ ముందుకు వచ్చింది.

ఈ ప్యాకేజీ కింద అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించే అవకాశం లభించింది. దీంతో పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక శతఘ్నులను తరలించవచ్చు. దీనిలో 8 బిలియన్‌ డాలర్లు సాధారణ ఆర్థిక మద్దతు కూడా ఉక్రెయిన్‌కు అందనుంది. దీంతోపాటు గ్లోబల్‌ ఫుడ్‌ ఎయిడ్‌లో భాగంగా 5 బిలియన్‌ డాలర్లను ఇవ్వనున్నారు. ఇక శరణార్థులను ఆదుకొనేందుకు బిలియన్‌ డాలర్లు కేటాయించనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమెరికా సీనియర్‌ మిలటరీ అధికారులు బ్రస్సెల్స్‌లోని నాటో  ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తూర్పు ఐరోపాలో నాటో బలగాల మోహరింపుపై చర్చించారు. వీటికి సంబంధించిన నిర్ణయాలు జూన్‌ తొలి వారంలో మాడ్రిడ్‌లో జరగనున్న సదస్సులో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే తూర్పు ఐరోపాలో నాటోకు చెందిన 40,000 దళాలు, 120 ఫైటర్‌ జెట్లు, 20 యుద్ధనౌకలు ఉన్నాయి. 

మరోపక్క స్వీడన్‌, ఫిన్లాండ్‌ను నాటోలో చేర్చుకొనేందుకు కూడా బైడెన్‌ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, స్వీడన్‌ ప్రధాని అండర్సన్‌ శ్వేతసౌధంలో బైడెన్‌ను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని