Remarriage: మాజీ భార్యతో మళ్లీ పెళ్లి ..! ఆ వివాహం వెనక కదిలించే స్టోరీ

చైనా(China)కు చెందిన ఓ ప్రేమ జంట కథ కదిలిస్తోంది. క్లిష్టసమయంలో ఓ మహిళకు తోడుగా ఉండేందుకు ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం మెప్పిస్తోంది. 

Published : 09 Feb 2023 18:23 IST

బీజింగ్‌: ప్రేమ జంటలు ఈ వాలంటైన్స్‌ వీక్‌లో తమ ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాయి. రోజుకో స్పెషల్ ట్రీట్‌తో ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఈ సమయంలో ఓ ప్రేమ కథ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న మహిళకు ఓ వ్యక్తి అందించిన భరోసా కదిలిస్తోంది. ఇక్కడే వారి కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

తూర్పు చైనా(China)కు చెందిన ఓ వ్యక్తి.. అప్లాస్టిక్‌ అనీమియాతో బాధపడుతోన్న ఓ మహిళను పెళ్లాడాడు. రెండు వారాల క్రితం ఆమెకు ఆ జబ్బు ఉందని తేలగా.. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడానికి ముందు ఆమెను వివాహమాడాడు. అయితే వారిద్దరు అంతకుముందే భార్యాభర్తలు కావడం గమనార్హం. కానీ విభేదాల కారణంగా మూడేళ్ల క్రితం విడిపోయారు. కానీ తన మాజీ భార్యకున్న వ్యాధి గురించి తెలుసుకున్న ఆ భర్త చలించిపోయాడు. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు తోడుగా ఉండాలనుకున్నాడు.

‘ఇప్పటికీ మేం ఒకే ఇంటిని షేర్ చేసుకుంటున్నాం. మా విడాకుల నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది. తన వ్యాధి గురించి తెలిసిన తర్వాత.. నేను ఆమెకు మళ్లీ ప్రపోజ్‌ చేశాను’ అని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఆ తర్వాత వారు చట్టపరంగా రెండోసారి వివాహం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చడానికి ఒక రోజు ముందు వివాహం చేసుకున్నారు. ‘ఇతరుల వివాహాలు ఆనందభరితంగా ఉంటాయి. కానీ మాకు మాత్రం కన్నీరు ఆగలేదు. ఆ వెంటనే ఆసుపత్రికి పరుగెత్తాం’ అని ఆ భర్త మీడియాకు తెలిపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీరి స్టోరీ, దానికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని