Vivek: చైనాలో ఎలాన్‌ మస్క్‌ పర్యటన ఆందోళనకరమే : వివేక్‌ రామస్వామి

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చైనాలో పర్యటించడం పట్ల అమెరికా నేత వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 01 Jun 2023 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చైనాలో బిజీ బిజీగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. మూడేళ్ల తర్వాత అక్కడ (China) పర్యటిస్తున్న మస్క్‌.. చైనా ప్రభుత్వ అధికారులు, కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇలా చైనాలో టెస్లా (Tesla) అధినేత పర్యటించడం పట్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఆందోళన వ్యక్తం చేశారు. తమ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తలను చైనా పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.

చైనాలో పర్యటిస్తోన్న మస్క్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. చైనాలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. చైనా శక్తి, వాగ్దానాలపై ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా చైనాతో అమెరికా దూరమవడాన్ని వ్యతిరేకించిన మస్క్‌.. రెండు దేశాల ప్రయోజనాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని అన్నారు. దీనిపై తాజాగా వివేక్‌ రామస్వామి స్పందించారు.

‘చైనా విదేశాంగ మంత్రితో భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య దూరం పెరగడాన్ని వ్యతిరేకించడంతోపాటు రెండు దేశాలను కవలలుగా పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని చైనాలోని టెస్లా వైస్‌ ప్రెసిడెంట్‌ అక్కడి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కానీ, అమెరికాలో కాదు’ అని మస్క్‌ పర్యటనకు సంబంధించి వివేక్‌ రామస్వామి ఓ వీడియో విడుదల చేశారు. బీజింగ్‌ అజెండాకు అనుకూలంగా అమెరికా వ్యాపారవేత్త ప్రచారం చేస్తున్నారని, ఇది చైనాకు అనుకూలిస్తుందన్నారు. అమెరికాకు కావాల్సింది.. చైనా జేబుల్లో ఉండే నేతలు కాదని, బైడెన్‌తోనూ ఇదే తరహా సమస్య అని వివేక్‌ రామస్వామి విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని