Vladimir Putin: పుతిన్‌ ఆరోగ్యంపై వార్తలు.. క్రిమియా వంతెనను సందర్శించిన రష్యా అధ్యక్షుడు!

పుతిన్‌ జారి మంచాన పడ్డారని పశ్చిమ దేశాల పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించారు. స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి క్రిమియా వంతెనను సందర్శించారు.  

Updated : 06 Dec 2022 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా వంతెన( Crimean bridge)ను సందర్శించారు.  ఈ వీడియోలో పుతిన్‌ (Putin) స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారును డ్రైవ్‌ చేస్తూ క్రిమియా వంతెనపై ప్రయాణించారు. ఈ దృశ్యాలను రష్యా(Russia)లో ఓ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఈ సమయంలో పుతిన్‌ పక్కన డిప్యూటీ ప్రధాని మారాట్‌ ఖుసులిన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా వంతెనపై దాడి గురించి వారు చర్చించుకున్నారు.

‘‘వంతెన ఎడమ వైపు దాడి జరిగింది. ఇది పనిచేసే స్థితిలోనే ఉందని అనుకొంటున్నాను. అయినప్పటికీ దాని పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికీ కొంత దెబ్బతిని ఉంది. దీనిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి’’ అని పుతిన్‌ పేర్కొన్నారు. దాదాపు 19 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 2018లో పుతిన్‌ ప్రారంభించారు. అప్పట్లో కూడా ఆయన ట్రక్కుపై స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ దీనిపై ప్రయాణించారు. 

ఇటీవల కాలంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని, తీవ్ర అనారోగ్యం వల్లే ఇలా జరిగిందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. రెండు రోజుల క్రితం ఆయన.. మాస్కో(Masco)లోని తన అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా పడిపోయారని, దీంతో తుంటి ఎముక విరిగిపోయిందని న్యూయార్క్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతడి ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందని అందులో రాసుకొచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వార్తలు వెలువడుతున్న తరుణంలో రష్యా టెలివిజన్‌ ఈ దృశ్యాలను ప్రసారం చేయడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని