Vladimir Putin: క్రెమ్లిన్‌లో ‘ఫ్లూ’ భయం.. బంకర్‌లోకి పుతిన్‌..!

రష్యాలో ఫ్లూ వ్యాప్తి పెరిగింది. అధ్యక్ష భవనంలోని చాలా మంది అధికారులు ఫ్లూతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు అధ్యక్షుడు పుతిన్‌ను బంకర్‌లోకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 14 Dec 2022 01:57 IST


( మార్చి 2020లో కొవిడ్‌ సమయంలో ఓ ఆసుపత్రిలో పర్యటించిన పుతిన్‌ )

మాస్కో: రష్యాకు మరోసారి ఫ్లూ భయం పట్టుకుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. అటు అధ్యక్ష భవనంలోని అధికారులకు ఈ అంటువ్యాధి సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)ను బంకర్‌లో ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం. వార్షిక మీడియా సమావేశం నిర్వహించడం లేదని అధికారులు పేర్కొన్న కొన్ని గంటలకే ఈ వార్త వెలువడింది. మరోవైపు పుతిన్‌ ఆరోగ్యంపై భిన్న కథనాలు వెలువడుతోన్న వేళ.. క్రెమ్లిన్‌లో ఫ్లూ (Flu) వ్యాప్తిపై వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల రష్యాలో (Russia) ఫ్లూ వ్యాప్తి ఎక్కువైనట్లు ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో చాలా మంది అధికారులు ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలోనూ ప్రసంగానికి పుతిన్‌ దూరంగా ఉండనున్నారని క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇలా అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ అంటువ్యాధి విజృంభణ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్‌ను పౌరులకు దూరంగా ఉంచేందుకు అధికారులు ఆయన్ను బంకర్‌లోకి (Bunker) తరలించినట్లు సమాచారం. కొత్త సంవత్సర వేడుకలనూ పుతిన్‌ అక్కడే జరపుకోనున్నారని మరో వార్త సంస్థ వెల్లడించింది. ఉరల్‌ పర్వతాల్లోని తూర్పు భాగంలో ఉన్న ఓ బంకర్‌లో పుతిన్‌ గడపనున్నట్లు పేర్కొంది.

మరోవైపు దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు రష్యా ప్రజారోగ్య నిపుణులు హెచ్చరించారు. ‘ఈ ఏడాది ఫ్లూ వ్యాప్తి భారీగా ఉండనుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ వేరియంట్‌ ఫ్లూ రకానికి చెందినదే. 2009లో మహమ్మారిగా అవతరించిన ఫ్లూ A (H1N1) రకానికి చెందింది’ అని రష్యా నిపుణురాలు అన్నా పొపోవా వెల్లడించారు. ఇటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. లక్షణాలు కనిపించిన వెంటనే ఇంటికే పరిమితం (Home Isolation) కావాలని స్పష్టం చేశారు. వీటితోపాటు మాస్కులు ధరించడంతోపాటు ముఖం, చేతులు, శ్వాసకోశ భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

వార్షిక మీడియా సమావేశానికి పుతిన్‌ దూరం.. 

‘ఈ ఏడాది వార్షిక మీడియా సమావేశాన్ని అధ్యక్షుడు పుతిన్‌ నిర్వహించడం లేదు. గత పదేళ్లలో ఇదే తొలిసారి’ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కేవలం ప్రత్యేక సైనిక చర్యగా పేర్కొనే పుతిన్‌పై ఉక్రెయిన్‌కు సంబంధించిన ప్రతికూల ప్రశ్నలకు ఎదుర్కోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పుతిన్‌ పాలనను ప్రపంచానికి చాటి చెప్పడంలో భాగంగా ఏటా మాస్కోలో వార్షిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగే ఈ కార్యక్రమంలో దేశ, విదేశీ విధానాలపై అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగించడంతోపాటు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. సుదీర్ఘ సమయంపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలనూ వెల్లడిస్తారు. గత కొంత కాలంగా అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. పుతిన్‌ ఆరోగ్యం, ఉక్రెయిన్‌లో పుతిన్‌ సేనల వైఫల్యాలపై వార్తలు వస్తోన్న తరుణంలో ఈ ఏడాది కీలక సమావేశానికి పుతిన్‌ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఫ్లూ వ్యాప్తి కారణంతో అధ్యక్షుడు పుతిన్‌ను ప్రత్యేక బంకర్‌లోకి తరలించారనే వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని