Published : 02 Apr 2022 02:00 IST

Biden Vs Putin: ఒంటరైన పుతిన్‌.. కీలక సలహాదారుల హౌస్‌ అరెస్ట్‌..?

తమవద్ద సమాచారం ఉందన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై గడిచిన నెల రోజులకుపైగా సైనిక చర్య కొనసాగిస్తున్నప్పటికీ పుతిన్‌ పైచేయి సాధించకపోవడంపై అగ్రరాజ్యం సహా ఇతర దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో సైనిక చర్యపై రష్యా సైన్యం పుతిన్‌ను తప్పుదోవపట్టించారనే వాదన మొదలయ్యింది. దీంతో రష్యా సేనల ఆపరేషన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న అధ్యక్షుడు పుతిన్‌ ఒంటరైనట్లు కనిపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అంతేకాదు ఈ వైఫల్యానికి కారణంగా భావిస్తోన్న కొందరు కీలక సలహాదారులను హౌస్‌ అరెస్ట్‌ చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని.. ఇందుకు సంబంధించి తమవద్ద సమాచారం ఉందన్నారు.

‘పుతిన్‌ తన సలహాదారుల్లో కొందర్ని తొలగించడమో లేదా హౌస్‌ అరెస్టు చేసినట్లు సమాచారం ఉంది. అయితే, వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు లేనందున ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వివరించారు. ఇక ఉక్రెయిన్‌పై సైనిక చర్య వ్యూహాత్మక తప్పిదమని.. అది రష్యాను ఎంతగానో బలహీనపరుస్తుందని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి కేథరిన్‌ బెడింగ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యాపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న ఆమె.. ప్రపంచ వేదికపైనా రష్యా ఒంటరి అవుతుండడం క్రమంగా పెరుగుతోందన్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య పేలవంగా జరగడంతోపాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై ఏ విధంగా ఉంటుందన్న విషయాలు పుతిన్‌కు తెలియదని అమెరికా నిఘావర్గాలు అంచనా వేశాయి. ఈ విషయంలో రష్యా సైనికాధికారులు పుతిన్‌ను తప్పుదోవపట్టించారని అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కీలక సలహాదారుల్లో కొందర్ని పుతిన్‌ తొలగించడమో లేదా హౌస్‌ అరెస్ట్‌ చేసి ఉండవచ్చని వైట్‌హౌస్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలాఉంటే, ఫిబ్రవరి 24న సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌పై మొదలుపెట్టిన దురాక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సైనికుల భీకర దాడులకు ఉక్రెయిన్‌ సర్వనాశనం అవుతోంది. ఐరాస గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో 1232 మంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోగా వేల మంది గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఇప్పటికే 40లక్షల మంది దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts