Putin: మళ్లీ అలాంటి ఉగ్రచర్యకు పాల్పడ్డారో.. ఉక్రెయిన్‌కు పుతిన్‌ వార్నింగ్‌!

కెర్చ్‌ వంతెన కూల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్‌ పై తమ సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు. ఉగ్ర చర్యకు పాల్పడినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు స్పష్టం చేశారు.

Published : 11 Oct 2022 01:17 IST

మాస్కో: కెర్చ్‌ వంతెన కూల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్‌(Ukraine)పై తమ సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) స్పందించారు. ఉగ్ర చర్యకు పాల్పడినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు స్పష్టం చేశారు. క్రిమియా-రష్యాను అనుసంధానం చేసే కీలక వంతెనను పేల్చివేయడం ఉగ్రచర్య అని.. ఉక్రెయిన్‌ ప్రత్యేక బలగాలే ఈ దాడి వెనుక ఉన్నాయని పుతిన్‌ మండిపడ్డారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. టర్కిష్‌ స్ట్రీమ్‌ పైపులైన్‌ని సైతం పేల్చి వేసేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి ఉగ్రచర్యలకు పాల్పడితే మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. తమ రక్షణ మంత్రిత్వ శాఖ సూచన మేరకే రష్యా జనరల్‌ స్టాఫ్‌ ఓ ప్లాన్‌ ప్రకారం ఉక్రెయిన్‌లోని ఇంధనం, మిలటరీ, కమ్యూనికేషన్‌ స్థావరాలపై దాడులు జరిపినట్టు వెల్లడించారు. తమ భూభాగంలో ఇలాంటి ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే మాత్రం తగిన విధంగా ప్రతిస్పందిస్తామని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని పుతిన్‌ తేల్చి చెప్పారు. 

ఇది ఆరంభమే.. దిమిత్రి మెద్విదేవ్‌

రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్విదేవ్‌ కూడా ఈ అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఉక్రెయిన్‌ అంతటా నీరు, విద్యుత్‌ సేవలకు అంతరాయం కలిగించేలా జరిపిన క్షిపణి దాడులు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. ఉక్రెయిన్‌ ఇంధనం, మిలటరీ కమాండ్‌, కమ్యూనికేషన్‌ ఫెసిలిటీస్‌ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్టు రష్యా రక్షణశాఖ తెలిపింది.  దాడులు విజయవంతమయ్యాయని.. తమ లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించుకుంది. 

అక్కడ ఓటమితో పుతిన్‌ నిరాశ చెందడం వల్లే.. 

ఉక్రెయిన్‌లో ఇంధన మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాల సేవలకు విస్తృతంగా అంతరాయం కలిగినట్టు తెలిపారు.  రష్యాపై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్‌, జర్మనీ నేతలను కోరినట్టు జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఇంకోవైపు, ఈ దాడులు ప్రేరేపితమైనవి కాదని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌ భూభాగంలో తమ సైన్యాన్ని ఎదుర్కోలేక ఎదురైన పరాజయాలకు పుతిన్‌ నిరాశకు గురయ్యారని.. అందుకు యుద్ధాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకే క్షిపణులతో విరుచుకుపడ్డారని కులేబా అభిప్రాయపడ్డారు.

పుతిన్‌ బలహీనతకు నిదర్శనం: యూకే

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్‌ క్లెవర్లీ అన్నారు. ఈ చర్యలు పుతిన్‌ బలహీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ఇంధన సౌకర్యాలతో పాటు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంతో కీవ్‌ నగరంలోని విద్యుత్‌ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ల్వీవ్‌ మేయర్‌ ఆండ్రీ సడోవి తెలిపారు. ఒకవేళ అత్యవసరమైతే తప్ప ఈరోజు కీవ్‌ నగరానికి వెళ్లకపోవడమే మంచిదని ఆ నగర మేయర్‌ విటాలీ క్లిట్ష్కో అన్నారు. మరోవైపు, పుతిన్‌ సేనల దాడుల్లో కీవ్‌లో కనీసం 11మంది మృతిచెందగా.. 64మందికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్‌ పోలీసులు వెల్లడించారు. సెంట్రల్‌ షెవ్కెంకో జిల్లాలో విశ్వవిద్యాలయంతో పాటు మ్యూజియంలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ పేలుడు ధాటికి అనేక చెట్లు, కొమ్మలు కాలిపోయాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని