Ukraine Crisis: పుతిన్‌ కుమార్తెలపై ఆంక్షలకు ఈయూ సిద్ధం..!

రష్యాకు చెందిన పలు రంగాల్లోని ప్రముఖులు, సంస్థలపై దృష్టి కేంద్రీకరించిన ఈయూ దేశాలు.. పుతిన్‌ కుమార్తెలపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నట్లు ఈయూ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Updated : 06 Apr 2022 14:20 IST

ఉక్రెయిన్‌పై మారణహోమానికి ప్రతిస్పందన చర్యలు

మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముందువరుసలో ఉన్న యూరోపియన్‌ యూనియన్‌ (EU).. ఇప్పటికే స్విఫ్ట్‌ నుంచి తొలగించడంతోపాటు ఇతర ఆంక్షలను ప్రకటిస్తోంది. ముఖ్యంగా రష్యాకు చెందిన పలు రంగాల్లోని ప్రముఖులు, సంస్థలపై దృష్టి కేంద్రీకరించిన ఈయూ దేశాలు.. పుతిన్‌ కుమార్తెలపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యా సేనలు చేస్తోన్న మారణకాండకు ప్రతిస్పందనగా ఈయూ ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రష్యా కొనసాగిస్తోన్న దురాక్రమణపై తీవ్రంగా మండిపడుతోన్న ఈయూ దేశాలు.. పుతిన్‌ సన్నిహితులపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా రష్యాకు చెందిన రాజకీయ నాయకులు, టైకూన్‌లతోపాటు పలువురు ప్రముఖుల ఆస్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే పుతిన్‌ ఇద్దరు కుమార్తెలపైనా ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. ఏయే చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రతిపాదిత జాబితాను ఈయూ సిద్ధం చేసింది. ఇందుకు ఈయూ సభ్యదేశాలు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే, పుతిన్‌ కుమార్తెలు కాటెరినా, మరియాలకు రష్యా వెలుపల ఆస్తులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రతీకార చర్యలో భాగంగా పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లేలా వీరిద్దరి పేర్లను ఆంక్షల జాబితాలో ఈయూ దేశాలు చేర్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించిన క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌.. ఈయూ ప్రతిపాదన గురించి తనకు తెలియదన్నారు.

వారి గురించి అంతా రహస్యమే..

పుతిన్‌ కూతుళ్లకు సంబంధించిన విషయాలు అత్యంత రహస్యంగానే ఉంటాయి. వారి పేర్లతో పాటు ఫొటోలను కూడా రష్యా అధ్యక్ష భవనం ఎన్నడూ అధికారకంగా వెల్లడించలేదు. వివిధ పేర్లను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. అయితే, 2015లో కుమార్తెలకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించిన పుతిన్‌.. ఇద్దరు అమ్మాయిలు రష్యన్‌ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారని, పలు భాషలను మాట్లాడగలరని మాత్రమే వెల్లడించారు. ఇక కరోనా వ్యాక్సిన్‌ తొలిసారి రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన సందర్భంలోనూ తన కుమార్తె టీకా తీసుకున్నట్లు పుతిన్‌ వెల్లడించారు. ఇక ఇద్దరిలో పెద్ద కూతురు మరియా వొరొన్త్‌సోవా.. రష్యాలో ప్రజారోగ్య విభాగంలోని ఓ అతిపెద్ద ప్రైవేటు కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. కాటెరినా మాత్రం మాస్కో స్టేట్‌ యూనివర్సిటీలో కృత్రిమ మేధకు సంబంధించిన ఓ ఇన్‌స్టిట్యూట్‌ను నడిపిస్తున్నారు. అయితే, రష్యా వెలుపల వారికున్న ఆస్తులపై మాత్రం స్పష్టత లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు