Ukraine Crisis: మా దేశం ఒంటరిగా మిగిలింది.. రష్యా టార్గెట్‌ నేనే..!

శత్రుదేశం రష్యా మొదటి గురి తనేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 25 Feb 2022 12:19 IST

వాపోయిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

కీవ్‌: శత్రుదేశం రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘శత్రుదేశం నన్ను నంబర్ వన్ టార్గెట్‌గా గుర్తించింది. ఆ తర్వాత వారి లక్ష్యం నా కుటుంబం. దేశాధినేతను గద్దె దింపేసి, వారు ఉక్రెయిన్‌ను రాజకీయంగా ధ్వంసం చేయాలనుకుంటున్నారు. కానీ, నేను, నా కుటుంబం ఈ దేశాన్ని విడిచిపెట్టిపోం. కీవ్‌లోనే ఉండిపోతాం’ అని జెలెన్‌స్కీ ప్రతిజ్ఞ చేశారు.

మరోపక్క, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన తీవ్రంగా వాపోయారు. ‘మా దేశాన్ని కాపాడుకునే విషయంలో మేం ఒంటరయ్యాం. మాతో కలిసి పోరాడేందుకు ఎవరున్నారు? నాకైతే ఎవరూ కనిపించలేదు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరున్నారు? అందుకు అందరూ భయపడుతున్నారు’ అని విచారం వ్యక్తం చేశారు. 

యుద్ధం ముగింపునకు రష్యా మాతో మాట్లాడాలి..

‘ఇరు దేశాల మధ్య జరుగుతోన్న సైనిక పోరు ముగియాలంటే రష్యా మాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ చర్చ ఎంత త్వరగా ప్రారంభమైతే, రష్యాకు ఎదురయ్యే నష్టం అంత తక్కువగా ఉంటుంది. అలాగే ఈ దాడులు ముగిసేవరకు.. మా దేశానికి రక్షణగా నిలుస్తాం’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై ఉక్రెనియన్, రష్యన్ భాషల్లో రష్యాకు సందేశం పంపారు.

గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉక్రెయిన్‌లోకి దూకుడుగా ముందుకెళ్తోన్న రష్యా.. కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణశాఖ ఆయుధగారాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ సైనిక పోరులో ఇప్పటివరకు 137 మంది తమదేశ వాసులు ప్రాణాలు కోల్పోయారని జెలెన్‌స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులు ఉన్నారని తెలిపారు. సుమారు 316 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే రష్యాకు చెందిన విధ్వంసక బృందాలు రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించాయని, అంతా కర్ఫ్యూను పాటించాలని ప్రజల్ని అప్రమత్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని