Zelenskyy: మా సేనల ధీరత్వాన్ని శత్రువు తట్టుకోలేకపోతున్నాడు.. పుతిన్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ వ్యాఖ్యలు

జపోరిజియాలో తమ నియంత్రణ పరిధిలోని ప్రాంతాలపై రష్యా శుక్రవారం చేపట్టిన భారీ దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. ‘‘యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న పరాభవాన్ని, మా సేనలు కనబరుస్తున్న సమర్థతను చూసి శత్రువు తట్టుకోలేకపోతున్నాడు.

Updated : 01 Oct 2022 10:02 IST

కీవ్‌: జపోరిజియాలో తమ నియంత్రణ పరిధిలోని ప్రాంతాలపై రష్యా శుక్రవారం చేపట్టిన భారీ దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. ‘‘యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న పరాభవాన్ని, మా సేనలు కనబరుస్తున్న సమర్థతను చూసి శత్రువు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే కోపంతో ఈరోజు విరుచుకుపడి, అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాడు. మేము కోల్పోయిన ప్రతి ప్రాణం విషయంలోనూ శత్రు దేశం సమాధానం చెప్పక తప్పదు. ఆ సమయం తప్పకుండా వస్తుంది. తాము రష్యాతో చర్చలకు సిద్ధమేనని, అయితే మరో అధ్యక్షుడితో మాత్రమే చర్చలు జరుపుతామని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరే విషయమై దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాం. ఇందుకు నిర్ణయాత్మకంగా ముందడుగువేసి ‘యాక్సెలెరేటెడ్‌ అప్లికేషన్‌’ను సమర్పిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత, రక్షణ మండలిని అత్యవసరంగా సమావేశపరిచిన ఆయన.. తాజా పరిస్థితులపై వారితో సమాలోచనలు జరిపారు. యుద్ధారంభంలో తమపై ఆంక్షలకు దిగిన పశ్చిమ దేశాలు... ఇప్పుడు ఏకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయని పుతిన్‌ ఆరోపించారు. బాల్టిక్‌ సముద్రం మీదుగా జర్మనీకి తాము నిర్మించిన నార్డ్‌ స్ట్రీమ్‌ 1, 2 గ్యాస్‌ పైపులైన్లను ఆ దేశాలు ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను అమెరికా, పశ్చిమ దేశాలు తోసిపుచ్చాయి. సముద్రగర్భ పేలుళ్ల కారణంగానే ఈ పైప్‌లైన్‌ పగిలి, భారీగా మీథేన్‌ విడుదలవుతోందని పేర్కొన్నాయి.

రెఫరెండం చెల్లదు: ఐరాస
ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో రష్యా తుపాకులతో బెదిరించి, ప్రజాభిప్రాయం చేపట్టిందని... ఈ రెఫరెండం చెల్లదని ఐరాస ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చర్యను ఖండించే తీర్మానంపై సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌  నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం
ఉక్రెయిన్‌ భూభాగాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది.  నాలుగు ప్రాంతాల విలీనం చేసుకోవడంపై నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మండిపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూభాగాన్ని బలవంతంగా లాక్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌లు కూడా విలీన చర్యను తీవ్రంగా ఖండించాయి. వెయ్యికిపైగా రష్యన్‌ సంస్థలు, ప్రముఖులపై అమెరికా నిషేధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా పలు సేవలు, వస్తువుల ఎగుమతులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయవద్దనీ.. రెఫరెండానికి, విలీనానికి చట్టబద్ధత లేదనీ అన్నారు. ఉక్రెయిన్‌కు అదనంగా సుమారు రూ.98 వేల కోట్ల (12 బిలియన్‌ డాలర్ల) సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని