Ukraine crisis: జీ20 నుంచి తొలగించినా మాకు నష్టంలేదు: రష్యా

ప్రస్తుతం ‘జీ-20’ నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టం ఏమీ లేదని క్రెమ్లిన్ పేర్కొంది.....

Published : 26 Mar 2022 02:25 IST

మాస్కో: జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ప్రస్తుతం జీ20 నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన జీ20 నుంచి రష్యాను బహిష్కరించడంలో అమెరికా, దాని మిత్రదేశాలు విజయం సాధించినా.. పెద్దగా ఏం జరగదని తాజాగా పేర్కొంది. ‘జీ-20 కూటమి ముఖ్యమైనదే. కానీ, ప్రస్తుతం ఇందులోని చాలా దేశాలు మాపై ఆర్థిక ఆంక్షలు విధించినవే. కాబట్టి మమ్మల్ని తప్పించినా పెద్దగా ఏం కాదు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అయితే, రష్యాను ఏకాకి చేయడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు పాక్షికంగానే ప్రభావం చూపాయని, అవి చివరికి విఫలమవుతాయని పెస్కోవ్ అన్నారు.

జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇది వరకే పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులపై గురువారం నాటో (NATO)తో అత్యవసర సమావేశాల అనంతరం బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాను బహిష్కరించే అంశంపై జీ20లోని ఇతర దేశాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. అయితే ఇండోనేషియా లేదా ఇతర దేశాలు ఈ విషయంలో విభేదిస్తే.. ఉక్రెయిన్ నేతలను ఆయా దేశాలతో చర్చలు జరపాలని కోరతానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని