Ukraine Crisis: రష్యా ఒక్కటే కాదు.. ఉక్రెయిన్‌ ముందు మరిన్ని గండాలు..!

రష్యా జరుపుతోన్న దురాక్రమణతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌ నుంచి ఎదురవుతోన్న ప్రతిఘటన.. రష్యాను మరింత రెచ్చగొడుతోంది.

Published : 27 Mar 2022 01:44 IST

పొలండ్‌లో శరణార్థి శిబిరంలో

కీవ్‌: రష్యా జరుపుతోన్న దురాక్రమణతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌ నుంచి ఎదురవుతోన్న ప్రతిఘటన.. రష్యాను మరింత రెచ్చగొడుతోంది. దాంతో పుతిన్‌ సేనలు ఆసుపత్రులు, నివాస సముదాయాలు అనే తేడా లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోపక్క మేరియుపొల్‌లో విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నాయి. చిన్నారులున్నారని బోర్డు పెట్టినప్పటికీ.. అక్కడి థియేటర్‌పై దాడి చేయడంతో 300 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఖర్కివ్ నగరంలో ఎక్కడికక్కడ ఖననం చేయని శవాలు గుట్టలు కనిపిస్తున్నాయి. అనాథలుగా మారిన చిన్నారులు.. శిథిలాల మధ్య బూడిదలో తిరుగుతూ తమవారి కోసం, ఆహారం కోసం వెతుకున్నారనే వార్తలతో హృదయాలు ద్రవిస్తున్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తోన్న దయనీయ పరిస్థితులు. కానీ పరోక్షంగా అక్కడి ప్రజలు ఆరోగ్య సేవలు అందక మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం, పరిశుభ్రమైన నీరు అందక, కనీస సౌకర్యాల లేమితో మెదడువాపు, మీజిల్స్, కలరా, కొవిడ్-19 వంటి వ్యాధులు పొంచి ఉండగా, యుద్ధంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఆసుపత్రిగా మారిన పాఠశాల..ఇందులో చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది

మేరియుపొల్ రష్యా పోరులో ధ్వంసమవుతోంది. 2011లో అక్కడ కలరా వ్యాప్తిని గుర్తించారు. 2016లో జపొరిజియాలో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం సరైన ఆహారం, నీరు అందుబాటులో లేకపోవడంతో ఆ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 18 నాటికి లుహాన్స్క్‌ ప్రాంతంలో 1,20,000 మందికి నీటి సౌకర్యం లేదు. ప్రభుత్వ నియంత్రణలో లేని కొన్ని ప్రాంతాల్లో 4,60,000 మందికీ అదే పరిస్థితి. ఇక ప్రజలు యుద్ధవాతారణంలో చిక్కుకొని ఉండటంతో ప్రజలు తీవ్ర మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ అంచనావేస్తోంది. అలాగే గర్భనిరోధక సాధనాల కొరతతో లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొంది. 

ఆపైన కరోనా ఉండనే ఉంది. రష్యా దాడులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతోమంది బాంబు షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు. జనాలు గుమిగూడటం, అక్కడ సరిపడా వెంటిలేషన్ లేకపోవడంతో కొవిడ్ వంటి శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉంది. మార్చి 17 నుంచి 23 వరకు ఆ దేశంలో 27,671 కరోనా కేసులొచ్చాయి. 384 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసులు తక్కువగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. 

ప్రసూతి ఆసుపత్రిపై రష్యా దాడికి సాక్ష్యం..ఆ నిండు గర్భిణి తర్వాత మరణించింది

ఆ కల్లోలిత దేశంలో రానున్న మూడు నెలల్లో దాదాపు 80 వేల ప్రసవాలు జరగనున్నట్లు అంచనా. కానీ ఇటీవల రష్యా ప్రసూతి ఆసుపత్రుల మీద దాడి జరిపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు నిండుగర్భిణులు పడిన అవస్థల్ని ఈ ప్రపంచం చూసింది. వీటితో పాటు విద్యుత్ అంతరాయాలు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. సిజేరియన్లు చేసేందుకు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ వంటి సదుపాయాలు కల్పించేందుకు ఆసుపత్రుల్లో సామర్థ్యమూ తగ్గిపోయిందని తెలుస్తోంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని