Plane Crash: చైనా విమానం.. గాల్లోనే విచ్ఛిన్నమైందా..?

చైనాలో గత సోమవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలేంటో ఇంతవరకూ అంతుచిక్కట్లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

Published : 25 Mar 2022 14:01 IST

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొనసాగుతోన్న గాలింపు..

బీజింగ్‌: చైనాలో గత సోమవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలేంటో ఇంతవరకూ అంతుచిక్కట్లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విమానం కుప్పకూలడానికి ముందు గాల్లోనే విచ్ఛిన్నమై ఉంటుందని తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విమానం కూలిన ప్రదేశానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ లొగోతో ఉన్న ఓ విమాన శకలాన్ని గుర్తించినట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఆ శకలం.. ప్రమాదానికి గురైన విమానానిదే అని దర్యాప్తు అధికారులు ధ్రువీకరిస్తే గనుక.. ఘటనకు గల కారణాలపై ఓ అంచనాకు రావొచ్చని అధికారులు అంటున్నారు. అదే నిజమైతే విమానం గాల్లో ఉన్నప్పుడే విచ్ఛిన్నమై ఉండొచ్చని భావిస్తున్నారు. 

దీంతో ఆ విమాన శకలం ఎక్కడ నుంచి పడింది.. ఎప్పుడు పడింది అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఆ శకలం 1.3 మీటర్ల పొడువు, 10 సెంటీమీటర్ల వెడల్పు ఉందని అధికారులు వెల్లడించారు. విమానం అత్యధిక వేగంతో వెళ్తున్న సమయంలో పీడనం ఏర్పడి ఈ శకలం విరిగిపోయిందా లేదా ఒక్కసారిగా కుప్పకూలే సమయంలో విడిపోయిందా అన్నది తెలుసుకోవడం ఇప్పుడే సాధ్యం కాదని రెస్క్యూ టీం హెడ్‌ తెలిపారు.  

విమాన ప్రమాదంలో ఇప్పటికే ఓ బ్లాక్‌బాక్స్‌ను గుర్తించగా.. రెండో దానికోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో విమాన అవశేషాలతో పాటు కొన్ని వాలెట్లు, గుర్తింపు-బ్యాంకు కార్డులు, మానవ అవశేషాలను గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ జీవించి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని