Time Theft: వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఆఫీస్‌ సమయం వృథా.. మాజీ ఉద్యోగినికి రూ.3లక్షల ఫైన్‌

వర్క్‌ఫ్రం హోం సమయంలో ఆఫీస్‌ సమయాన్ని వృథా చేశారనే కారణంతో ఓ ఉద్యోగినికి రూ.3లక్షల జరిమానా పడింది.  ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఉద్యోగి పనితీరును విశ్లేషించినట్లు సదరు కంపెనీ వెల్లడించింది.

Published : 19 Jan 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఇంటి నుంచే పని (Work from Home)కు అనుమతించాయి. దీంతో ఇంటినుంచే స్వేచ్ఛగా పనిచేసుకునే సౌలభ్యం ఉద్యోగులకు లభించింది. అయితే, దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో ఆఫీస్‌ సమయాన్ని వృథా చేశారని.. అందుకు కంపెనీకి రూ.3లక్షలు చెల్లించాలని ఓ ఉద్యోగినిని ఆదేశించింది. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఉద్యోగిని పనితీరును విశ్లేషించి ‘సమయం చోరీ’ చేసిన విషయాన్ని గుర్తించినట్లు సదరు కంపెనీ పేర్కొనడం గమనార్హం.

కెనడాకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ.. అక్కడి బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. అయితే, ఆ సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి గతేడాది తొలగించింది. కారణం మాత్రం చెప్పలేదు. దీంతో తనకు పరిహారం చెల్లించాలని ఆ ఉద్యోగిని సంస్థను డిమాండ్‌ చేయడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరింది.

తన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పర్యవేక్షిస్తారని సదరు మహిళ చేసిన ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. కేవలం ఆఫీస్‌ డాక్యుమెంట్లను మాత్రమే తమ సాఫ్ట్‌వేర్‌ పర్యవేక్షిస్తుందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌ ఎంత కచ్చితంగా పనిచేస్తుందోననే విషయాన్ని కూడా వివరించింది. 50గంటలపాటు ఆమె లాగిన్‌ అయినట్లు చూపించినప్పటికీ ఆ సమయంలో తనకు అప్పజెప్పిన పని మాత్రం చేయలేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ విశ్లేషణను కోర్టు ముందు ఉంచింది. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఉద్యోగిని తొలగించిన వ్యవహారాన్ని పక్కన బెడితే.. కంపెనీ సమయాన్ని వృథా చేసినందుకు ఆ మాజీ ఉద్యోగినే సంస్థ నుంచి వివిధ రూపాల్లో పొందిన ప్రయోజనాల మొత్తం రూ.3లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.

ఆఫీస్‌ సమయాల్లో ఉద్యోగి పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని టైమ్‌క్యాంప్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో సదరు కంపెనీ పర్యవేక్షించేదట. ఆఫీస్‌ డాక్యుమెంట్లను ఎంత సేపు ఓపెన్‌ చేసి ఉంచారు, వాటిని ఎలా ఉపయోగించారనే విషయాలను ఈ సాఫ్ట్‌వేర్‌ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో కార్లే బెస్సె ఆఫీస్‌ టైంలో ఎక్కువగా కంప్యూటర్‌కు దూరంగా ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని