Rishi Sunak: అప్పట్లో నేనూ జాతి వివక్ష ఎదుర్కొన్నా.. కానీ..! : రిషి సునాక్‌

బ్రిటన్‌ రాజభవనంలో ఇటీవల వచ్చిన జాతి వివక్షపై ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. గతంలో తానూ వివక్షను ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు.

Published : 03 Dec 2022 01:13 IST

లండన్‌: జాత్యాహంకార ఆరోపణలకు బ్రిటన్‌ రాజభవనం మరోసారి వేదికయ్యింది. ఓ నల్లజాతి సంతతికి చెందిన మహిళపై రాజభవనంలోని సీనియర్‌ సిబ్బంది జాతి వివక్ష చూపించారన్నది వివాదం. దీంతో వివాదానికి కారణమైన ప్యాలెస్‌ సిబ్బంది ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. తాజాగా వీటిపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. ఈ వివాదంపై తాను వ్యాఖ్యానించడం సరైంది కాదన్న ఆయన.. తన జీవితంలోనూ జాత్యాహంకారాన్ని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేడు అలాంటివి జరుగుతాయని తాను నమ్మడం లేదన్నారు. అలాంటివి ఎప్పుడు కనిపించినా దీటుగా ఎదుర్కోవాలన్నారు.

‘వివాదంపై నేను వ్యాఖ్యానించడం సరైంది కాదు. గతంలో నేనూ వివక్షను ఎదుర్కొన్నా. నా చిన్నతనంలో, యుక్త వయసులో ఉన్నప్పుడు నాకు అటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. కానీ, నేటికీ జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. జాత్యాహంకారాన్ని ఎదుర్కోవడంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. ఆ ప్రయత్నం ఎన్నటికీ ముగిసిపోదు. మనకు అటువంటి సందర్భం ఎప్పుడు కనిపించినా.. దాన్ని దీటుగా ఎదుర్కోవాలి’ అని ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ వెల్లడించారు. మునుపటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని సూచించారు.

బ్రిటన్‌ రాజభవనం నివాసముండే బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో ఇటీవల ఈ జాతి వివక్ష ఆరోపణలు వచ్చాయి. బ్రిటిష్‌ ఛారిటీకి చెందిన మహిళను (నగోజీ ఫులాని) ఏ దేశానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చావ్‌ అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రిన్స్‌ విలియమ్‌ గాడ్‌మదర్‌ సుసాన్‌ హుస్సే పదే పదే ప్రయత్నించారన్నది ఆరోపణ. అలా విచారించడం తనకెంతో అవమానంగా అనిపించిందని ఫులాని వెల్లడించడంతో వివాదం బయటకు వచ్చింది. దీంతో ప్యాలెస్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన సుసాన్‌ హుస్సే.. ఆ ఘటనపై క్షమాపణలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని