Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!

ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో జరిగిన దారుణాలు వెలుగులోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాదవుతోంది. సైనిక చర్యలో భాగంగా మాస్కో సేనలు ఈ పట్టణాన్ని ఆక్రమించగా.. మార్చి 31న ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది.

Published : 31 Mar 2023 20:42 IST

కీవ్‌: వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. చేతులు వెనక్కి కట్టి, తలపై కిరాతకంగా కాల్చి హతమార్చిన గుర్తులు.. మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఆనవాళ్లు.. సామూహిక సమాధులు.. ధ్వంసమైన ఇళ్లు.. యుద్ధ ట్యాంకుల శిథిలాలు - సరిగ్గా ఏడాది క్రితం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌(Kyiv)కు సమీపంలోని బుచా(Bucha) పట్టణంలో వెలుగుచూసిన దృశ్యాలివీ. ఇక్కడి దారుణాలతో మొత్తం ప్రపంచమే కలత చెందింది! సైనిక చర్యలో భాగంగా రష్యా(Russia) ఆక్రమించిన ఈ పట్టణాన్ని.. మార్చి 31న ఉక్రెయిన్‌(Ukraine) దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) శుక్రవారం బుచా అకృత్యాలను గుర్తుచేస్తూ.. వాటికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని పేర్కొన్నారు.

‘బుచా పట్టణం.. 33 రోజులపాటు ఆక్రమణలో ఉంది. స్థానికంగా 37 మంది చిన్నారులతోసహా 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సామూహిక సమాధులు, చిత్రహింసల గదుల్లో 175 మందికి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. ఆక్రమిత సైన్యం దురాగతాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ పట్టణం.. 365 రోజులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. ఇక్కడ 9 వేల యుద్ధ నేరాలు నమోదు చేశాం. బుచాలో దారుణాలకు పాల్పడిన వారిని మేం ఎప్పటికీ క్షమించం. ప్రతి నేరస్థుడిని శిక్షిస్తాం’ అని జెలెన్‌స్కీ ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. మరోవైపు.. బుచాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్ కార్యాలయం దాదాపు 100 మంది రష్యన్ సైనిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. 35 మందిపై అభియోగాలు మోపింది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యా సేనలు కీవ్‌ దిశగా వేగంగా వచ్చినా.. తొలి ప్రతిఘటన బుచాలో ఎదురైంది. కీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో ఉక్రెయిన్‌ దళాలు రష్యా సైనిక వాహనశ్రేణిపై ఎదురుదాడి చేశాయి. బుచా- ఇర్పిన్‌ల మధ్య ఉన్న ఓ వంతెనను కూడా పేల్చేశాయి. దీంతో రష్యా దళాలు ముందుకుసాగలేకపోయాయి. తదనంతర పరిణామాల్లో.. మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. అనంతరం ఇక్కడ వెలుగుచూసిన దృశ్యాలు అందరిని కదిలించాయి. ఇది సామూహిక హత్యాకాండ అని అప్పట్లో జెలెన్‌స్కీ నిప్పులు చెరిగారు. అయితే, బుచాపై ఉక్రెయిన్‌ది దుష్ప్రచారమని రష్యా ఖండించింది. ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తునకు ఐరాస భద్రతా మండలిలో భారత్ మద్దతు పలికింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు