Russia: రష్యాపై ఆంక్షలు ఎత్తివేయకపోతే.. అంతరిక్ష కేంద్రం కూలిపోవచ్చు..!

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. పాశ్చాత్య దేశాల నుంచి కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

Published : 12 Mar 2022 14:31 IST

మరోసారి హెచ్చరించిన  రోస్‌కాస్మోస్ చీఫ్‌

మాస్కో: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. పాశ్చాత్య దేశాల నుంచి కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకుంటున్న చర్యలతో ఐఎస్‌ఎస్‌ కూలిపోయే ప్రమాదం ఉందని రోస్‌ కాస్మోస్( రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ)  మరోసారి హెచ్చరించింది. వెంటనే ఈ కఠిన ఆంక్షలు ఎత్తివేయాలని సంస్థ డైరెక్టర్‌ దిమిత్రి రోగోజిన్‌ పిలుపునిచ్చారు. వాటివల్ల ఐఎస్‌ఎస్‌కు రష్యా వైపునుంచి అందుతున్న సేవలకు అంతరాయం కలగనుందని వెల్లడించారు. ఫలితంగా 500 టన్నుల బరువైన ఈ నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత రోగోజిన్‌ ఇదివరకే ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డారు.

ఐఎస్‌ఎస్‌ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను అందజేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలున్నాయి. ఇందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే.. మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్‌ సిస్టమ్స్‌లను యూఎస్‌ నిర్వహిస్తోంది. ఇక ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.

ఎందుకంటే ఐఎస్‌ఎస్‌ పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో లేదు. ఇది కొద్దిగా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటుంది. అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది కొంత శక్తిని కోల్పోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే.. అది కూలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం నియంత్రిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి. అలాగే దానికి కావాల్సిన వేగాన్ని కూడా అందిస్తాయి. అయితే అంతరిక్ష కేంద్రానికి రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని