putin: పుతిన్‌ కలల వంతెన పేల్చివేత వెనక మాస్టర్‌ ప్లాన్‌..?

ఉక్రెయిన్‌ పై సైనిక చర్యలో రష్యాకు తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ కెర్చ్‌ వంతెన పేల్చివేత..! ఈ దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతోంది.

Updated : 10 Oct 2022 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ కెర్చ్‌ వంతెన పేల్చివేత..! ఈ దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతోంది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు  ఉక్రెయిన్‌పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు తొలుత అంతా భావించారు. కానీ, ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం.. నిపుణుల విశ్లేషణలు.. క్రిమియా ద్వీపకల్పం బీచ్‌ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్‌ప్లాన్‌ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

వీడియో ఫుటేజీలో రెండో కోణం చూస్తే..

కెర్చ్‌ వంతెనపై పేలుడు జరిగిన సమయంలో దీనిపై ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న మరో వంతెనపై ఓ రైలు ఇంధన వ్యాగన్లతో ట్రక్కు సమీపంలోకి రాగానే భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ పేలుడు కచ్చితంగా ట్రక్కు నుంచే జరిగినట్లు ఎక్కడా తెలియడం లేదు. ఈ ట్రక్కు రష్యా నగరమైన క్రస్నాడర్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సమీర్‌ యుసుబోవ్‌కు చెందినదిగా గుర్తించారు. పేలుడు ఘటన సమయంలో దీనిని అతడి బంధువు మఖీర్‌ యుసుబోవ్‌ నడిపినట్లు తేల్చారు. కానీ, వేర్వేరు కోణాల్లో ఈ ఫుటేజీలను చూస్తే పేలుడుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

పేలుడు జరిగిన రోజే ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ట్విటర్‌ ఖాతా ‘ఓఎస్‌ఐఎన్‌టీ అమెచ్యూర్‌’ ఓ వీడియో క్లిప్‌ విడుదల చేసింది. దానిలో వంతెనపై ట్రక్కు ఓ ప్రదేశంలోకి రాగానే.. వంతెన పిల్లర్ల మధ్య నుంచి ఓ చిన్నపాటి పడవ వంటిది తేలుతూ బయటకు వచ్చింది.  మరుక్షణమే భారీ పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం తతంగం పక్కనే ఉన్న వంతెనపై అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. సముద్రపు డ్రోన్‌ సాయంతో ఈ దాడి చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వంతెనలను.. పైనుంచి కిందకు నెట్టే శక్తిని, పక్క నుంచి నెట్టే గాలి శక్తిని తట్టుకొనేలా డిజైన్‌ చేస్తారు. అంతేగానీ, కింద నుంచి పైకి వచ్చే శక్తిని తట్టుకొనేలా డిజైన్‌ చేయరన్న వాదనలు సముద్ర డ్రోన్‌ వినియోగాన్ని బలపరుస్తున్నాయి.

నెలల నుంచి రెక్కీ..?

క్రిమియా బీచ్‌లోని సెవస్టపోల్‌ నౌకాదళ స్థావరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ మానవ రహిత నౌకను రష్యా దళాలు కనుగొన్నట్లు గత నెల 21వ తేదీన ఫోర్బ్స్‌ కథనంలో పేర్కొంది. రష్యన్లు దీనిని సముద్రంలో ఓ పక్కకి నెట్టివేసి పేల్చేశారని వెల్లడించింది. ఈ  నౌకను ఉక్రెయిన్‌ రహస్య ఆయుధంగా యుద్ధ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ నౌక నిండా పేలుడు పదార్థాలు ఉండటంతో పేల్చివేసినట్లు వారు అనుమానించారు. దీనిని గుర్తించిన ప్రదేశం ఉక్రెయిన్‌కు కేవలం 150 మైళ్ల దూరంలో ఉంది. ఈ బోట్‌పై సెన్సర్లు, కెమెరా, కమ్యూనికేషన్‌ పరికరాలు ఉన్నాయి. రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో దీనిని సముద్రంలోని లక్ష్యం సమీపానికి చేర్చి పేల్చివేయడానికి అనుకూలంగా ఉంది.

అమెరికాలోని పెంటగాన్‌ నుంచి ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌కు అందిన 800 మిలియన్‌ డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీలో కొన్ని ‘మానవ రహిత తీర రక్షణ పడవలు’ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌కెర్బీ కూడా అప్పట్లో ధ్రువీకరించారు. దీంతో అమెరికా పడవలపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. తాజా దాడులకు కచ్చితంగా ఫలానా కారణం అని చెప్పలేని స్థితి నెలకొంది. గతంలో మాస్కోవా నౌక విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై రష్యా దర్యాప్తు నివేదికలు ఏమి పేర్కొంటాయనే విషయం కీలకంగా మారింది.   

ఈ ఘటన ఎందుకు కీలకం..

* కెర్చ్‌ వంతెన పేల్చివేత వ్యక్తిగత స్థాయిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. పుతిన్‌ చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో ఈ వంతెన నిర్మాణం కూడా ఒకటి. ఆయనే స్వయంగా ట్రక్కు నడిపి ఈ వంతెనను  ప్రారంభించారు. తాజాగా ఆయన 70వ పుట్టిన రోజు గడిచిన కొన్ని గంటల్లోనే ఈ వంతెనను పేల్చివేశారు.

* ఈ ఘటనతో యుద్ధ క్షేత్రంలో కీలకమైన క్రిమియాకు సరుకులు, ఆయుధాలు, ఇంధన రవాణా దాదాపు నిలిచిపోయాయి. 

* ఉక్రెయిన్‌ ఈ దాడికి బాధ్యత స్వీకరించలేదు. కానీ, సంబరాలు మాత్రం చేసుకుంటోంది. మాస్కోవా యుద్ధ నౌక, కెర్చి వంతెనను క్రిమియాలో రష్యా శక్తిగా చూసేవారు. ఇప్పుడు ఆ రెండింటిపై దాడి జరిగింది. 

* కెర్చ్‌ వంతెన పేల్చివేత రష్యాకు భారీ ఎదురుదెబ్బని అమెరికా మాజీ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ మైక్‌ ముల్లెన్‌ పేర్కొన్నారు. దీంతో రష్యా అణుదాడి చేసే ముప్పు పెరిగిపోయింది. ఈ దాడికి మాస్కో ప్రతిస్పందన ప్రమాదకరంగా ఉంటుందని అంచనావేస్తున్నారు.Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు