Ukraine Crisis: కీవ్‌ గొంతుపై కత్తిపెట్టి.. మేరియుపోల్‌ స్వాధీనం..!

అజోవ్‌స్తల్‌లోని ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోవడం మేరియుపొల్‌ లాంఛనంగా పుతిన్‌ సేనల పరమైంది. ఈ విజయం రష్యా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి కూడా వెనుకాడలేదు.

Published : 18 May 2022 11:58 IST

ఉక్రెయిన్‌ దళాలను ఏమార్చి రష్యా వ్యూహాత్మక విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అజోవ్‌స్తల్‌లోని ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోవడంతో మేరియుపోల్‌ లాంఛనంగా పుతిన్‌ సేనల పరమైంది. ఈ విజయం కోసం రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి కూడా వెనుకాడలేదు. కానీ, ఆది నుంచి మేరియుపోల్‌ నగరాన్ని పుతిన్‌ సేనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏప్రిల్‌లోనే మేరియుపోల్‌పై విజయం సాధించినట్లు మాస్కో ప్రకటించినా.. స్టీల్‌ ప్లాంట్‌ స్వాధీనం చేసుకోలేకపోయింది. తాజాగా ఆ ప్లాంట్‌ కూడా చేతికి దక్కడంతో క్రెమ్లిన్‌కు పరువు దక్కినట్లైంది. దీంతో తాజాగా కొత్త ప్రాంతంపై పుతిన్‌ సేనలు దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌కు తీరప్రాంతాల సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గిపోయింది. ఇప్పుడు ఒడెస్సా రేవు వైపు నుంచి మాత్రమే నల్లసముద్రంలోకి ఉక్రెయిన్‌ ఓడలు రాగలవు.

కీవ్‌ను రక్షించుకొంటే చాలు అన్నట్లు చేసి..!

అజోవ్‌ సముద్రం ఒడ్డున ఉన్న మేరియుపోల్‌ నగరంలో దాదాపు 4,50,000 జనాభా ఉంది. ఇది క్రిమియా-డాన్‌బాస్‌ మధ్యలో ఉంటుంది. 18వ శతాబ్దం నుంచి వ్యాపార కేంద్రంగా నిలిచింది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకొన్న తర్వాత డాన్‌బాస్‌ ప్రాంతాన్ని గుప్పిట్లోకి తీసుకొంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న మేరియుపోల్‌ను రష్యా మద్దతు ఉన్న  వేర్పాటు వాదులు స్వాధీనం చేసుకొన్నారు. కానీ, కొన్నిరోజులకే ఉక్రెయిన్‌కు చెందిన అతివాద గ్రూప్‌ అజోవ్‌ బెటాలియన్‌, డెనిప్రో-1 బెటాలియన్ల సాయంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం తిరిగి దీనిని స్వాధీనం చేసుకొని.. వేర్పాటు వాదులను తరిమేసింది.

ఈ సారి మాత్రం రష్యా భారీ ఏర్పాట్లతోనే రంగంలోకి దిగింది. ముప్పేట దాడితో యుద్ధం మొదలుపెట్టింది. దీంతో మేరియుపోల్‌ను రక్షించుకొనేంత సమయం కీవ్‌కు ఇవ్వలేదు. తొలి రోజు నుంచే పుతిన్‌ సేనలు రాజధాని కీవ్‌ దిశగా కదలాయి. కీవ్‌ను రోజుల తరబడి చుట్టుముట్టి కూర్చొన్నాయి. పదుల కిలోమీటర్ల పొడవైన కాన్వాయ్‌లను చూసి ఉక్రెయిన్‌ బెంబేలెత్తిపోయింది. దీంతో ఉక్రెయిన్‌ సైన్యం రాజధానిని రక్షించుకొంటే చాలు అన్నట్లు పనిచేసింది. ఫలితంగా మేరియుపోల్‌లో పోరాడుతున్న దళాలకు కీవ్‌ నుంచి మద్దతుగా ఆయుధాలు, ఇతర సరఫరాలు తగినంత అందలేదు. మరోవైపు పుతిన్‌ సేనలు ఈ నగరంపై యుద్ధవిమానాలు, ట్యాంకులు, శతఘ్నులతో నిర్విరామంగా దాడులు చేశాయి. ఫలితంగా 90శాతం నగరం శిథిలమైపోయింది. నీరు, విద్యుత్తు, ఆహార, ఔషధ సరఫరాలను నిలిపివేసింది. భారీ సంఖ్యలో ప్రజలు వలసపోయారు. ఈ దాడుల్లో దాదాపు 20,000 మంది మరణించి ఉండొచ్చని ఉక్రెయిన్‌ అంచనావేస్తోంది.

మొదటి నుంచి తమకు కీవ్‌ను స్వాధీనం చేసుకొనే ఉద్దేశం లేదని పుతిన్‌ చెబుతూనే ఉన్నారు. కానీ, ఇందుకు విరుద్ధంగా రష్యా భారీ సైనిక కాన్వాయ్‌లు మాత్రం ఆ నగర శివార్లలోనే ఉక్రెయిన్‌ సేనల దాడుల్లో ఎదురు దెబ్బలు లెక్కచేయకుండా రోజుల తరబడి ఉన్నాయి. కీవ్‌లో ప్రవేశించేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. మేరియుపోల్‌పై పట్టు సాధించిన తర్వాత ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతానికి ఆ కాన్వాయ్‌లను మళ్లించారు.

మేరియుపోల్‌లో అజోవ్‌ రెజిమెంట్‌, ఇతర ఉక్రెయిన్‌ దళాలు నక్కిన స్టీల్‌ ప్లాంట్‌ చుట్టుముట్టి తాపీగా దాడులు చేస్తూ పుతిన్‌ సైన్యం కాలం గడిపింది. సరఫరాలు నిలిచిపోవడంతో ఇక చేసేదేమి లేక అజోవ్‌ రెజిమెంట్‌, ఇతర సైనికులు లొంగిపోవాల్సి వచ్చింది.

భారీగా సముద్రతీరాన్ని కోల్పోయిన ఉక్రెయిన్‌..

అజోవ్‌ సముద్రంపై పట్టు లేకపోవడంతో ఉక్రెయిన్‌ 80శాతం నల్లసముద్ర తీరాన్ని కోల్పోయినట్లైంది. ఇక్కడ ఉక్రెయిన్‌కు ఉన్న డీప్‌బెర్త్‌ పోర్టు అతిపెద్దది. ఈ ప్రాంతం నుంచి ఉక్కు, బొగ్గు, మొక్కజొన్న వంటివి మధ్యప్రాశ్చ్యానికి ఎగుమతి చేస్తారు. ఈ నగరాన్ని కోల్పోవడం ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బ. దీంతోపాటు నియో-నాజీలుగా రష్యా ఆరోపించే అజోవ్‌ రెజిమెంట్‌ను ఓడించినట్లు క్రెమ్లిన్‌ ప్రచారం చేసుకొనే అవకాశం లభించింది. అదుపులోకి తీసుకొన్న అజోవ్‌ గ్రూపు సభ్యులతో ఇన్ఫర్మేషన్‌ వార్ఫేర్‌లో భాగంగా పరేడ్‌ నిర్వహించే అవకాశాలను కూడా కొట్టపారేయలేని పరిస్థితి. అంతేకాదు.. రష్యా యుద్ధం ఓడిపోతోందన్న పశ్చిమ దేశాల ప్రచారానికి సమాధానంగా మేరియుపోల్‌ నగరంలో విజయాన్ని రష్యా తమ దేశ ప్రజలకు చూపించనుంది. ఈ విజయం క్రెమ్లిన్‌ మనోస్థైర్యాన్ని పెంచింది.

రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలు.. 

మేరియుపోల్‌ యద్ధంలో రష్యా అనేక అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐరోపాకు చెందిన ఆర్గనైజేషన్‌ సెక్యూరిటీ అండ్‌ కోఆపరేషన్‌ ఏప్రిల్‌ 13వ తేదీన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ రిపోర్టును విడుదల చేసింది. మేరియుపోల్‌ నగరంలో ప్రసూతి ఆసుపత్రి, పౌరులు తలదాచుకొన్న థియేటర్‌పై రష్యా బాంబింగ్‌ చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు మరణించారు. దీంతో అంతర్జాతీయ మానవీయ చట్టాలను రష్యా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని ఈ నివేదకలో పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని