Ukraine Crisis: అమెరికా ఆయుధానికి రెండు వైపులా పదును..!

అమెరికా-రష్యా మధ్య వైరం ప్రపంచానికి ముప్పుగా మారుతోంది. రష్యాను ఎలాగైన ఉక్రెయిన్‌లో ఓడించాలనే తపనతో అమెరికా భారీ ఎత్తున యాంటీ ట్యాంక్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను తరలిస్తోంది.

Updated : 20 Apr 2022 12:19 IST

 ఉగ్రవాదుల చేతికి చేరే ప్రమాదం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా-రష్యా మధ్య వైరం ప్రపంచానికి ముప్పుగా మారుతోంది. రష్యాను ఎలాగైనా ఉక్రెయిన్‌లో ఓడించాలనే తపనతో అమెరికా భారీ ఎత్తున యాంటీ ట్యాంక్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను తరలిస్తోంది. ఈ పరిణామాలపై అమెరికాలో సైనిక వ్యూహకర్తలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్షిపణులు, తుపాకులను తేలిగ్గా ఎక్కడికైనా తరలించవచ్చు. దీంతో  ఇవి ఉగ్రవాదులకు అందే ప్రమాదం కూడా ఉందని భయపడుతున్నారు. మరోవైపు అమెరికా అగ్ర నాయకత్వం మాత్రం ఆయుధ సరఫరాలో ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు.

అమెరికా మరో 800 మిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసే అంశంపై బైడెన్‌ కార్యవర్గం కసరత్తు చేస్తోందని సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది.  ఈ సారి ప్యాకేజీలో భారీ శతఘ్నులు, వేల రౌండ్ల ఫిరంగి గుండ్లు, యాంటీ ట్యాంక్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆయుధాలను పంపించే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర కూడా పడే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్‌ చెప్పిందే వినాల్సిన పరిస్థితి..

ఉక్రెయిన్‌కు పంపించే ఆయుధాలను ట్రాక్‌ చేసేందుకు సరైన వ్యవస్థను మాత్రం అమెరికా సిద్ధం చేసుకోలేదు. ఈ అంశంపై రక్షణశాఖ అధికారి ఒకరు సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ ‘‘దీర్ఘకాలంలో ఈ ఆయుధాలు ఎక్కడికి చేరతాయో చెప్పలేం. ప్రత్యర్థి సైన్యాలకూ దక్కవచ్చు.. లేదంటే సాయుధ మూకల చేతిలో పడొచ్చు. కానీ, వీటిపై విశ్లేషించేంత సమయం లేదు. యుద్ధం మొదలు కావడంతో వేగంగా ఆయుధ సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చీకట్లో ఆయుధాలను ఉంచి రావడమే.. ఎవరికి చేరతాయో ఇంత స్వల్ప సమయంలో చెప్పలేం’’ అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అమెరికా ఓ భాగస్వామ్య దేశానికి ఇంత పెద్ద ఎత్తున సైనిక సాయం అందించలేదని సదరు అధికారి తెలిపారు.

అమెరికా దళాలు ఉక్రెయిన్‌ గడ్డపై లేవు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉక్రెయిన్‌ అధికారికంగా ఇచ్చే సమాచారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ కేవలం అమెరికా నుంచి ఆయుధ, దౌత్య సాయం అందడానికి ఏం కావాలో అంతవరకే చెబుతోందని పెంటగాన్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ‘‘ఇది యుద్ధం.. వారు బహిరంగంగా చేస్తున్నది.. మాట్లాడుతున్నది.. అంతిమంగా వారు ఈ యుద్ధంలో విజయం సాధించడానికి సాయం చేసే పనులే. ప్రతి బహిరంగ ప్రకటన ఇన్ఫర్మేషన్‌ ఆపరేషన్‌. జెలెన్‌స్కీ కనిపించిన ప్రతి సందర్భం, ఇంటర్వ్యూ ప్రతి అంశం దీనిలో భాగమే. అంతమాత్రాన వారు చేస్తోంది తప్పేమీ కాదు’’ అని పేర్కొన్నారు.

వాస్తవానికి ఉక్రెయిన్‌లో రష్యా దళాల పరిస్థితి, వారు వాడే ఆయుధాలు వంటి అంశాల సమాచారం అమెరికా, పశ్చిమ దేశాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఉక్రెయిన్‌ దళాల వైపు నష్టంపై మాత్రం వారి వద్ద సమాచారం లేదు. ఈ విషయంలో పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్‌ మధ్య సమాచార లోపం కనిపిస్తోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అమెరికా సైన్యం అక్కడ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడిస్తున్నారు.

పోలాండ్‌లో అప్పగించిన తర్వాత..

అమెరికా సరఫరా చేసే జావెలిన్‌, స్టింగర్‌ క్షిపణులు, స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లను ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో ట్రాక్‌ చేయడం కష్టం.  ఇదే విషయాన్ని గత వారం అమెరికా అధికారులు పేర్కొన్నారు. ‘‘అమెరికా ఆయుధాలను పోలాండ్‌కు తరలించగా.. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సైనికులు వాటిని స్వాధీనం చేసుకుని తమ దేశానికి తరలించి వాడుకొంటున్నారు. ముందే చెప్పినట్లు.. ఉక్రెయిన్‌ వీటిని వాడుకొంటోందా? మరేం చేస్తోంది.. అన్న విషయాలు అమెరికాకు తెలియవు’’ అని రక్షణశాఖ ప్రతినిధి జాన్‌ కెర్బీ కాంగ్రెస్‌ విచారణలో  పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ వద్ద ఉన్న ఎస్‌-300 వ్యవస్థల్లో ఎన్ని పనిచేస్తున్నాయో.. అన్న సమాచారం కూడా అమెరికా వద్ద లేదు. 

అదే స్లొవాకియా సరఫరా చేసిన భారీ ఎస్‌-300ను మాత్రం ట్రాక్‌ చేయవచ్చు. ఎందుకంటే దీనిని రైలుపై తరలించాల్సి ఉంటుంది. ఆయుధ విక్రయాలను అధ్యయనం చేసే ‘కాటో ఇన్‌స్టిట్యూట్‌’లోని విదేశీ వ్యవహారాల నిపుణుడు జాన్‌ కోహెన్‌  మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఆయుధాలు భారీగా తరలిస్తాం.. కానీ, యద్ధం ముగిసిన తర్వాత లేదా సుదర్ఘీ కాల ప్రతిష్ఠంభనగా మారిన తర్వాత ఈ ఆయుధాల పరిస్థితి ఏమిటీ అన్నది అత్యంత కీలకం’’ అని పేర్కొన్నారు. 

అఫ్గానిస్థాన్‌లో స్టింగర్లను కొనుగోలు చేసిన సీఐఏ.. 

అఫ్గానిస్థాన్‌ నుంచి సోవియట్‌ యూనియన్‌ తిరిగి వెళ్లిపోయాక.. అమెరికాకు కొత్త సవాలు ఎదురైంది. అఫ్గానిస్థాన్‌కు తరలించిన స్టింగర్‌ క్షిపణులను ముజాహిద్దీన్‌ల వద్ద నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం.. 65మిలియన్‌ డాలర్లతో బైబ్యాక్‌ కార్యక్రమం చేపట్టింది. కానీ, యుద్ధం చివరి నాళ్లలో సరఫరా చేసిన 1,000 స్టింగర్లను మాత్రమే సీఐఏ తిరిగి కొనుగోలు చేసింది. మిగిలినవి ఎక్కడ ఉన్నాయో మాత్రం రహస్యంగా మారిందని 1994లో వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రచురించింది. ఒక్క సారి యుద్ధం అఫ్గానిస్థాన్‌కు అనుకూలంగా మారగానే అమెరికా.. లెక్కపత్రం లేకుండా లాలీపాప్స్‌ వలే స్టింగర్‌ క్షిపణులను ముజాహిద్దీన్‌లకు అందించిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. 1996 నాటికి 600 క్షిపణులు గల్లంతైనట్లు తేల్చారు. ముజాహిద్దీన్‌లు తర్వాతి యుద్ధం కోసం వాటిని భద్రపర్చినట్లు అనుమానించారు. 2001లో అమెరికా విమానాలు అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన సమయంలో వీటిని వినియోగిస్తారేమోనని భయపడ్డారు. తాలిబన్‌, అల్‌ఖైదా మూకల వద్ద దాదాపు 300 వరకు ఈ క్షిపణులు ఉండొచ్చని పెంటగాన్‌ పేర్కొంది. 2005లో మరోసారి స్టింగర్ల బైబ్యాక్‌ను అమెరికా చేపట్టింది. ఇలాంటి పరిస్థితి ఉక్రెయిన్‌లో రాదని కచ్చితంగా చెప్పలేకుండా ఉన్నారు. ‘‘తాజాగా ఉక్రెయిన్‌ యద్ధం కోసం ఐదు కోట్ల రౌండ్ల మందుగుండును తరలించారు. అది మొత్తం రష్యాపైనే వినియోగిస్తారని చెప్పలేం. వీటిల్లో కొంత పక్కదోవ పట్టొచ్చు’’ అని  ‘కాటో ఇన్‌స్టిట్యూట్‌’కు చెందిన జాన్‌ కోహెన్‌  వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని