Ukraine Crisis: రష్యాకు ఎదురుదెబ్బలు ఎందుకు..?

రష్యా.. ప్రపంచలోనే రెండో అతిపెద్ద సైనిక శక్తి.. అతిపెద్ద అణ్వాయుధం కలిగిన దేశం.. కానీ, తన కంటే అతిచిన్న దేశంకపై చేసిన దురాక్రమణలో వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. భారీగా ఆయుధ సంపత్తిని నష్టపోతోంది..

Updated : 20 Mar 2022 14:16 IST

 స్పష్టంగా కనిపిస్తోన్న ప్రణాళికా లోపం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక శక్తి.. అతిపెద్ద అణ్వాయుధం కలిగిన దేశం.. కానీ, తన కంటే అతి చిన్న దేశంపై చేసిన దండయాత్రలో  వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. భారీగా ఆయుధ సంపత్తిని నష్టపోతోంది. కీలకమైన జనరల్స్‌ను కూడా కోల్పోతోంది.  రష్యా తప్పుడు అంచనాలతో దాడి చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చాలా మంది కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌ ఆక్రమణ పూర్తవుతుందని భావించారు. కానీ, ఉక్రెయిన్‌ పోరాట పటిమ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు వారాలు దాటుతున్నా.. ఇప్పటి వరకూ రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. భవిష్యత్తులో కూడా సాధించడం కష్టంగా మారిపోయింది. కొన్ని తప్పులే రష్యా వైఫల్యానికి కారణంగా నిలిచాయి.

తప్పుడు ఊహలతో కాలుదువ్వి..

యుద్ధానికి ముందు సైనిక సంపత్తి లెక్కలు చూస్తే రష్యా ఎదుట ఉక్రెయిన్‌ చాలా చిన్న దేశం.  రష్యా సైనిక బడ్జెట్‌ 60 బిలియన్‌ డాలర్లు కాగా.. ఉక్రెయిన్‌ది కేవలం 4 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో రష్యా తన సైనిక శక్తిని బాగా ఎక్కువగా ఊహించుకొంది. దీనికితోడు రష్యా సైనిక ఆధునీకరణ కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో టీ-14 అర్మతా ట్యాంకులు, కింజల్‌ వంటి హైపర్‌సానిక్‌ క్షిపణులు సమకూర్చుకొంది. కానీ, ఉక్రెయిన్‌పై యద్ధరంగంలో టీ-14 ట్యాంకులు ఎక్కడా కనిపించలేదు.. కేవలం పాత టీ-72 ట్యాంకులను పంపింది. అదే సమయంలో సాంప్రదాయ సైనిక వాహనాలు, శతఘ్నులు, రాకెట్‌ లాంఛర్లనే వినియోగిస్తోంది.

ఆక్రమణ తొలి రోజుల్లో వైమానిక శక్తిని వినియోగించడంతో రష్యాకు బలమైన ఆధిక్యం లభించింది. సరిహద్దుల సమీపం నుంచి ఉక్రెయిన్‌ దళాలను విజయవంతంగా వెళ్లగొట్టారు. కానీ, ఆ తర్వాత ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు సమర్థంగా పనిచేయడంతో రష్యా దూకుడు మందగించింది. దీంతోపాటు స్పెట్స్‌నాజ్‌, వీడీవీ పారాట్రూపర్స్‌ వంటి రష్యా ప్రత్యేక దళాలు కూడా ఉక్రెయిన్‌ ప్రతిఘటనను అణగదొక్కలేకపోయాయి.

ఇక దళాలకు నిరంతరం సరఫరాలు ఉండేలా చూసేందుకు కీవ్‌ వద్ద ఎయిర్‌ బ్రిడ్జ్‌ను కూడా రష్యా నెలకొల్పలేకపోయింది. ఆ దళాలు హోస్టెమెల్‌ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకోవడంలో దళాలు విఫలమయ్యాయి. దీంతో రష్యా దళాలకు సరఫరాలు రోడ్డుమార్గంలో రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఉక్రెయిన్‌ బలగాల గెరిల్లా దాడులకు ఇవి తేలికపాటి లక్ష్యాలుగా మారిపోయాయి. దీంతో 65 కిలోమీటర్ల పొడవైన కాన్వాయ్‌ను పంపినా.. కీవ్‌ను ముట్టడించలేకపోయాయి.

నెలరోజుల్లో భారీగా సైనికులను కోల్పోయి..

రష్యా 1,90,000 మందితో ఉక్రెయిన్‌పై దండెత్తింది. వీరిలో చాలా మందికి యుద్ధంలో అనుభవం ఉంది. కానీ, నెల రోజులు కూడా పూర్తికాక ముందే.. దాదాపు 14,000 మంది సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్‌ చెబుతోంది.. కానీ,  తక్కువ సమయంలో ఈ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూడటంతో ఆ దళాల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. రష్యా దళాల్లో ఆహార కొరత, అలసట తీవ్రంగా కనిపిస్తున్నట్లు తేలింది.  ఇప్పటికే తీవ్రమైన చలిలో రష్యా, బెలారస్‌ సరిహద్దుల్లో నెలల తరబడి ఈ దళాలు వేచి ఉన్నాయి. దీంతో అదనపు బలగాలను తరలించడం, విదేశీ సైనికులను రప్పించడం  వంటివి చేస్తోంది.

సరఫరాలు-రవాణా సౌకర్యాలు ఘోరం..

రష్యా సరఫరాలు- రవాణా సౌకర్యాల విషయంలో పూర్తిగా విఫలమైంది. ‘‘ఔత్సాహికులు ఎత్తుగడల గురించి మాట్లాడుతారు.. నిపుణులు లాజిస్టిక్స్‌ గురించి అధ్యయనం చేస్తారు’’ అన్న సైనిక సంస్కృతి నానుడిని రష్యా మరిచినట్లు కనిపిస్తోంది. చాలా సైనిక శ్రేణుల్లో చమురు, ఆహారం కొరత ఏర్పడినట్లు సమాచారం. ఫలితంగా చాలా చోట్ల రష్యా వాహనాలు నిలిచిపోయాయి.

ఇక ఆయుధాల కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఇప్పటికే దాదాపు 900 వరకు దీర్ఘశ్రేణి క్షిపణులు, రాకెట్లను రష్యా ప్రయోగించింది. దీంతో ఆయుధ కొరత ఏర్పడటంతో చైనాను సాయం కోరినట్లు అమెరికా ఆరోపించింది. మరో వైపు పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు  నిలకడగా ఆయుధ సరఫరాలు వస్తున్నాయి. కాకపోతే ఈ వైఫల్యాలు పెరిగే కొద్దీ రష్యా దాడి తీవ్రతను మరింత పెంచుతుందని భయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని