Brain Cancer: మెదడు క్యాన్సర్‌ ఇక మెడ వంచాల్సిందే..!

మెదడును పట్టిపీడించే గ్లియోబ్లాస్టోమా అనే ప్రమాదకర క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. ఈ వ్యాధి దూకుడుకు అసలు కారణాన్ని గుర్తించారు.

Updated : 24 Dec 2022 09:19 IST

మెదడును పట్టిపీడించే గ్లియోబ్లాస్టోమా అనే ప్రమాదకర క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. ఈ వ్యాధి దూకుడుకు అసలు కారణాన్ని గుర్తించారు. దాని జోరుకు కళ్లెం వేసే విధానాన్నీ వెలుగులోకి తెచ్చారు. ఈ మొండి క్యాన్సర్‌ను చికిత్సకు లొంగే వ్యాధిగా మార్చడానికి, బాధితులు ఎక్కువకాలం జీవించేలా చూడటానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఏమిటీ క్యాన్సర్‌?

గ్లియోబ్లాస్టోమా అనేది మెదడులోని ఆస్ట్రోసైట్లు అనే కణాల్లో తలెత్తుతుంటుంది. చాలా దూకుడుగా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా.. మెదడులోని అతిపెద్ద భాగమైన సెరిబ్రమ్‌లో ఇది పుట్టుకొస్తుంది. గ్లియోబ్లాస్టోమా కణితులు తమ సొంత రక్త సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటాయి. ఫలితంగా వేగంగా ఎదుగుతాయి. ఆరోగ్యంగా ఉన్న మెదడు కణజాలంలోకి చాలా సులువుగా ప్రవేశిస్తుంటాయి.


లక్షణాలివీ..

ఈ క్యాన్సర్‌ వ్యాప్తిలో వేగం కారణంగా మెదడుపై త్వరగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా తీవ్ర తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఆలోచన శక్తి మందగించడం, భావోద్వేగాల్లో మార్పులు, ఒక వస్తువు రెండుగా కనిపించడం, మాటల్లో తడబాటు వంటివి రావొచ్చు.


త్వరగా మరణం..

గ్లియోబ్లాస్టోమా బాధితుల్లో ఎక్కువ మంది రెండేళ్లలోనే చనిపోతున్నారు. అతికొద్దిమంది మాత్రమే ఐదేళ్ల వరకూ జీవిస్తున్నారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. సమర్థ చికిత్స విధానం అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దీనిపై పోరుకు శస్త్రచికిత్సలు, శక్తిమంతమైన ఔషధాలను వాడుతున్నారు. ఇంతచేసినా.. పెద్దగా ఫలితం ఉండటంలేదు.


ఇదీ పరిశోధన..

అమెరికాలోని కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ లేబొరేటరీ (సీఎస్‌హెచ్‌ఎల్‌)కి చెందిన ఎలీ మిల్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమాపై పరిశోధన చేశారు. ప్రధానంగా బీఆర్‌డీ8, పీ53 ప్రొటీన్లపై దృష్టిపెట్టారు.

* పీ53 అనేది శరీరంలోని సహజసిద్ధ క్యాన్సర్‌ రక్షణ కవచం. కణాలు మితిమీరి పెరిగి, కణితులుగా మారకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ ప్రొటీన్‌ నిర్వీర్యం కావడం వల్లే క్యాన్సర్లు  తలెత్తుతున్నాయి.

* అయితే గ్లియోబ్లాస్టోమాలోని మెజార్టీ కేసుల్లో పీ53 చెక్కుచెదరడంలేదు. అయినా ఈ క్యాన్సర్‌ ఎలా వ్యాప్తి చెందుతోందన్నది ఏళ్లుగా అంతుచిక్కకుండా ఉంది. దీనికి సమాధానం కనుగొనే క్రమంలో మిల్స్‌ బృందం కీలకాంశాన్ని గుర్తించింది. గ్లియోబ్లాస్టోమా బాధితుల్లో బీఆర్‌డీ8 కట్టుతప్పి వ్యవహరిస్తోందని గమనించింది. తద్వారా పీ53ని కొత్త పద్ధతిలో శక్తిహీనం చేస్తున్నట్లు తేల్చింది.

* క్రోమోజోముల్లోని జన్యువులు క్రియాశీలం కాకుండా బీఆర్‌డీ8 నిలువరిస్తుంటుంది. ఫలితంగా అవి నిద్రాణంగా ఉండిపోతాయి. గ్లియోబ్లాస్టోమా కేసుల్లో బీఆర్‌డీ8 లోపభూయిష్టంగా క్రియాశీలమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో పీ53లోని కీలక క్యాన్సర్‌ రక్షణ వ్యవస్థలు శక్తిహీనమవుతున్నట్లు తేల్చారు.

* జీనోమ్‌ ఎడిటింగ్‌ విధానం ద్వారా బీఆర్‌డీ8ని నిర్వీర్యం చేసినప్పుడు పీ53లోని రక్షణ వ్యవస్థలు మేల్కొని కణితిపై పోరాటం చేస్తున్నట్లు గుర్తించారు.


దీర్ఘాయుష్షు

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా కణితి కణాలను ఎలుకల్లోకి చొప్పించారు. ఫలితంగా వాటి మెదడులో ట్యూమర్లు పెరిగాయి. ఈ దశలో బీఆర్‌డీ8ని పరిశోధకులు క్రియారహితం చేశారు. దీనివల్ల పీ53 క్రియాశీలమైంది. ఫలితంగా కణితుల్లో పెరుగుదల ఆగిపోయింది. ఆ ఎలుకలు దీర్ఘకాలం జీవించాయి.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు