Updated : 20 Feb 2022 12:13 IST

Ukraine Crisis: క్రెమ్లిన్‌ టేబుల్‌ వెనుక అంత ప్లానింగా..!

 రష్యా దౌత్యభేటీలకు వాడుతున్న బల్లవెనక కథ ఇదీ..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌ సంక్షోభం ఉరుముతున్న వేళ ప్రపంచ నేతల డీఎన్‌ఏల భద్రత అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల ఫ్రాన్స్‌, జర్మనీ నేతలు రష్యానేత పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో వారు మాస్కోలో కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించారు. దీంతో పుతిన్‌ వారికి కనీసం షేక్‌హ్యాండ్‌ కూడా ఇవ్వలేదు. పూర్తిగా భౌతిక దూరం పాటించారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి. అదే సమయంలో దేశాధినేతల డీఎన్‌ఏల గోప్యత విషయంలో ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉంటారో ప్రపంచానికి తెలిసొచ్చింది.

అసలేం జరిగింది..

ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రోన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ వేర్వేరుగా మాస్కో పర్యటించారు. ఆ సమయంలో వారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కావడానికి ముందు కొవిడ్‌-19 నెగెటివ్‌గా నిర్ధారించేందుకు నాసిల్‌ స్వాబ్‌ సాయంతో పీసీఆర్‌  పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. వీరు గతంలో కొవిడ్‌ పరీక్షలను వ్యతిరేకించిన సందర్భాలూ లేవు. ఈ నేపథ్యంలో తమ డీఎన్‌ఏ సమాచార భద్రత కోసం వీరు ఈ విధంగా చేసి ఉంటారని భారీగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు రష్యాపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఈ నేతలు పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోకపోవడంతో దాదాపు 20 అడుగుల పొడవైన పాలరాతి బల్లను సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఓ వైపు పుతిన్‌ కూర్చొంటే.. మరో వైపు అతిథులు కూర్చొని కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు.

వాస్తవానికి అమెరికాలోని శ్వేత సౌధంలో కూడా అధ్యక్షుడిని కలిసే సమయంలో ఏ దేశాధినేత అయినా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. కాకపోతే వారి సొంత దేశం నుంచి తెచ్చుకొన్న పరికరాలు వాడుకొన్నా శ్వేతసౌధం అధికారులు అడ్డు చెప్పరు.

డీఎన్‌ఏతో ఏం చేస్తారు..

ప్రపంచ వ్యాప్తంగా గూఢచర్యంలో దేశాధినేతల డీఎన్‌ఏ సమాచారనికి చాలా విలువ ఉంటుంది. ఇది ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తల వెంట్రుకలు, నాసిల్‌ స్వాబ్‌, అధినేతలు పట్టుకొన్న వస్తువులను సమీకరించి డీఎన్‌ఏను సంపాదిస్తారు. వీటిని  విశ్లేషించి ఆ నేతల తల్లిదండ్రుల నిర్ధారణ, జన్యుపరమైన వ్యాధులు లేదా లోపాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొంటారు. ఆ నేత ఆరోగ్య పరిస్థితిని అంచనావేస్తారు.

రష్యా కేజీబీ పరిభాషలో ‘కాంప్రోమాట్‌’గా పిలిచే ఈ సమాచారాన్ని వాడుకొని ఆయా నేతలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయా నేతల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేసి రాజకీయ లక్ష్యాలను సాధించుకోవచ్చు. ఉదాహరణకు ఒక దేశాధినేతకు ఒక లోపం ఉందనుకోండి.. దానిని ఆయన ఎంతో రహస్యంగా ఉంచారనుకుందాం. ఆయన డీఎన్‌ఏ పొరబాటున ప్రత్యర్థి దేశాల గూఢచారులకు దొరికితే.. దానిని విశ్లేషిస్తారు. ఆ సమయంలో సదరు నేతకు ఉన్న ఆరోగ్య లోపాన్ని గుర్తించి.. దానిని బహిర్గతం చేసి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. లేదా మరో రకంగానూ వాడుకోవచ్చు.

గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయా.. నేతలు జాగ్రత్తలు తీసుకొంటారా..?

దేశాధినేతల వ్యక్తిగత ఆరోగ్య సమాచార చోరీపై గతంలో పలు సార్లు ఆరోపణలు, వివాదాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు వాడిన గ్లాసులు, బెడ్‌షీట్లు, ఆయన తాకిన వస్తువులను డీఎన్‌ఏ గోప్యత కోసం యూఎస్‌ నేవీ సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించేస్తారు. ఈ విషయాన్ని 2009లో వెలువడిన ‘ది ప్రెసిడెంట్స్‌ సీక్రెట్‌ సర్వీస్‌’లో వెల్లడించారు.

* ఒబామా హయాంలో ఆఫ్రికా ఖండంలోని కొందరు దేశాధినేతల వేలిముద్రలు, ఫేషియల్‌ ఇమేజ్‌లు, డీఎన్‌ఏ సమాచారాన్ని సేకరించడానికి అమెరికా ప్రయత్నించింది. ఇందు కోసం ఆయా దేశాల్లోని అమెరికా రాయబారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం వికీలీక్స్‌లో బహిర్గతమైంది.  

* కొన్నేళ్ల క్రితం ది ఎర్నెస్ట్‌ ప్రాజెక్ట్‌ అనే బృందం ‘దావోస్‌ సమ్మిట్‌’కు హాజరైన కొందరు దేశాధినేతల డీఎన్‌ఏ సమాచారాన్ని సమీకరించినట్లు ప్రకటించింది. వాటిల్లో కొన్ని ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్లు తెలిపింది. కానీ, చట్టపరమైన అవరోధాల కారణంగా ఆ వేలం జరగలేదు. 

ఆ బల్లను మేమే తయారు చేశాం..

ఇక రష్యా అధ్యక్షుడి సమావేశ మందిరంలోని 6 మీటర్ల పొడవైన బల్ల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మీమ్‌లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసింది తామేనని ఇటలీకి చెందిన ఓక్‌ ఫర్నిచర్‌ అనే సంస్థ ప్రకటించుకొంది. మార్బుల్‌తో తయారైన ఈ బల్లకు బంగారపు ఆకులను అమర్చారు. ఇటువంటిది ఒకే ఒక్క బల్లను తయారు చేశారు. దీనిని 1995లో క్రెమ్లిన్‌ (రష్యా అధ్యక్ష భవనం)కు సరఫరా చేశారు. దీని ధర ప్రస్తుతం 1,13,545 డాలర్లు ఉండొచ్చు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని