Published : 08 Apr 2022 01:51 IST

Srilanka Crisis: శ్రీలంకలో ఏం జరుగుతోంది.. 10 కీలక పాయింట్లు!

ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం: శ్రీలంకలో కొనసాగుతోన్న సంక్షోభం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభానికి తోడు అధికార కూటమి నుంచి దాదాపు 50 మంది చట్టసభ్యులు బయటకు వెళ్లిపోవడంతో రాజపక్స సర్కార్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వెల్లగక్కడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 

  1. ఔషధాల కొరత వేధిస్తుండంతో శ్రీలంక పలు అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కోరుతోంది. దేశంలో 40 రకాల ఔషధాలు, అత్యవసర మందుల కొరత ఉన్నట్టు ఔషధాల పంపిణీ, నియంత్రణ మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలో సాధారణంగా 1325 రకాల ఔషధాలు సరఫరా చేస్తుండగా.. వాటిలో 400 వరకు అత్యవసరమైనవనీ.. వీటిలో దాదాపు 40 రకాల ఔషధాల కొరత వేధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 
  2. శ్రీలంక కరెన్సీ విలువ మరింతగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంకన్‌ రూపాయి విలువ 319.99గా ఉన్నట్టు శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు వెల్లడించింది.
  3. శ్రీలంక వెళ్లాలనుకొనే తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. లంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఔషధాలు, ఇంధన కొరతతో పాటు కొవిడ్‌ నేపథ్యంలో అక్కడి వెళ్లే విషయాన్ని పునరాలోచించుకోవాలని సూచించింది. అలాగే, దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ అగ్రరాజ్యం ట్రావెల్‌ అడ్వెయిజరీని విడుదల చేసింది.
  4. శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థను రద్దు ప్రతిపాదనల్ని ఆ దేశంలోని ప్రతిపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయి. ఆ దిశగా బిల్లు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనను అతి త్వరలోనే పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్టు ప్రతిపక్షానికి చెందిన నేత లక్ష్మణ్‌ కిరిల్ల తెలిపారు. 
  5. శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ అజిత్ నివార్డ్‌ కబ్రాల్‌ విదేశీ ప్రయాణాలపై కొలంబో మెజిస్ట్రేట్‌ కోర్టు నిషేధం ప్రకటించింది. ఆయన దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఈ నెల 18న కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అజిత్ నివార్డ్‌ సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌గా ఉన్న కాలంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపుతూ శ్రీలంక సదరన్‌ ప్రావిన్స్‌ మాజీ గవర్నర్‌ కీర్తి తెన్నాకూన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు పై ఆదేశాలు ఇచ్చింది.
  6. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు వ్యతిరేకంగా అమెరికాలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. లాస్‌ఏంజెల్స్‌లోని ఆయన కుమారుడి ఇంటి వద్ద  కొందరు  శ్రీలంకకు చెందిన పౌరులు గుమిగూడారు. తన తండ్రిని ఇంటికి పిలవాలంటూ నినాదాలు చేస్తున్నారు.
  7. కాగితం కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ లంకలో సామాజిక మాధ్యమాలే ప్రత్యామ్నాయమవుతున్నాయి. డాలర్‌ సంక్షోభంతో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయకపోవడం వల్ల శ్రీలంకలో పేపర్ కొరత మరింత తీవ్రమైనట్టు శ్రీలంక పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి సెల్వం కెటిస్‌ పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ బ్యాంకు ఇతర సంబంధిత సంస్థల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇంకా పరిష్కారం చూపలేదన్నారు. దీనిపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌ క్రెడిట్‌ లైన్‌ కింద పేపర్‌ దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
  8. సంక్షోభం నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కాగితాన్ని పరిమితంగానే వాడాలని శ్రీలంక  హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాల అధికారులకు ఆదేశించింది. వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమ యాప్‌లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించడం అక్కడి సంక్షోభానికి అద్దంపడుతోంది. 
  9. దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వేళ శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స, క్రీడల మంత్రి నమల్‌ రాజపక్స ఈరోజు మిరిహనాలోని గొటబాయ అనధికారిక నివాసానికి వచ్చారు. మిరిహనాలోని శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబాయ ఇంటి వద్ద నిన్న భారీ సంఖ్యలో నిరసనకారులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయన రాజీనామాకు నిరసనకారులు డిమాండ్‌ చేయడంతో పోలీసులు భాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. ఆందోళనకారులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో నిరసనకారులతో పాటు కొందరు పోలీసులు, విలేకర్లు, పౌరులకు గాయాలయ్యాయి. ఈ హింసకు సంబంధించిన కేసులో 50 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
  10. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ శ్రీలంక ఆర్థిక మంత్రిగా బాధ్యతల్లోకి వచ్చిన 24గంటల్లోనే అలీ సార్బే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ స్థానంలోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఖాళీగానే ఉంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అనేక మంది ఎంపీలు వెనకడుగు వేస్తుండటం గమనార్హం.
Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts