Ukraine Crisis: నాటోలో చేరటం ఎలా..? ఉక్రెయిన్‌కు ఎందుకు సాధ్యం కాలేదు..?

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం ఐరోపాలోని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందా..? అంటే కచ్చితంగా ‘కాదు’ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ప్రధాన కారణాల్లో నాటో ఒకటి.  కీవ్‌ నాటోలో చేరడం ఇష్టంలేని మాస్కో యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా రష్యాతో

Updated : 16 May 2022 11:09 IST

 ఫిన్లాండ్‌, స్వీడన్‌ ప్రకటనలతో మరోసారి తెరపైకి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం ఐరోపాలోని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందా..? అంటే కచ్చితంగా ‘కాదు’ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ప్రధాన కారణాల్లో నాటో ఒకటి.  కీవ్‌ నాటోలో చేరడం ఇష్టంలేని మాస్కో యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా రష్యాతో 1,340 కిలోమీటర్ల సరిహద్దు పంచుకొంటున్న ఫిన్లాండ్‌ నాటోలో చేరతామని ప్రకటించింది. కొన్ని దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న ఈ దేశం తాజా పరిణామాలతో నాటో వైపు మొగ్గింది. దీంతో ‘ఫిన్లాండైజేషన్‌’ పేరిట ఈ దేశంపై సోవియట్‌ యూనియన్‌.. ఆ తర్వాత రష్యా చూపించిన ప్రభావం భవిష్యత్తులో అదృశ్యం కానుంది. 

ఫిన్లాండ్‌ ప్రకటన వెలువడిన గంటల్లోనే స్వీడన్‌ కూడా అదేబాట పట్టింది. తాజాగా స్వీడన్‌ ప్రధాని మాగ్డలీనా అండర్సన్‌ కూడా తమ దేశం నాటోలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. తీవ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. దీంతో దాదాపు 200 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న తటస్థవైఖరికి గుడ్‌బై చెప్పనున్నట్లైంది. ‘‘మా సోషల్‌-డెమొక్రటిక్‌, తటస్థవైఖరి మాకు బాగానే ఉపయోగపడింది. కానీ, భవిష్యత్తులో ఆ విధానం పెద్దగా ఉపయోగపడదని మా విశ్లేషణలో తేలింది. వాస్తవాన్ని అంగీకరించాలి. 2022 ఫిబ్రవరి 24కు ముందు.. తర్వాత అని చూడాలి. ఆ రోజు తర్వాత ఐరోపా, స్వీడన్‌ ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

నాటో అంటే ఏమిటీ..?

నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఒక సైనిక కూటమి. సోవియట్‌ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, కెనడా సహా 12 దేశాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత దీనిని విస్తరించారు. ప్రస్తుతం 30 సభ్యదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత పలు తూర్పు ఐరోపా దేశాలు సభ్యత్వం తీసుకొన్నాయి. వీటిల్లో కొన్ని రష్యాతో నేరుగా సరిహద్దులు పంచుకొంటున్నాయి.

సభ్యత్వం ఇచ్చేది ఇలా..

ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరే ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు రష్యా నుంచి దాడి ఎదురైతే ఆ దేశాలకు సైనిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని యూకే, అమెరికా ఇప్పటికే వెల్లడించాయి. తమ కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకొన్న దేశంలోని పరిస్థితులను నాటో సభ్యదేశాలు అధ్యయనం చేసి.. మార్పులు చేర్పులు సూచిస్తూ ఓ యాక్షన్‌ ప్లాన్‌ను ఇస్తాయి. దరఖాస్తు చేసుకొన్న దేశం వాటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. 2020లో నాటో సభ్యత్వం తీసుకొన్న నార్త్‌ మసెడోనియాకు రెండేళ్ల సమయం పట్టింది. ఈ దేశం 1999 నుంచి నాటో ఇచ్చిన మెంబర్‌షిప్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా నాటోలో చేరాలనుకునే  దేశాల్లో  ప్రజాస్వామ్యం ఉండాలి. మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయి ఉండాలి. దీంతోపాటు ఆ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలపై ఎటువంటి వివక్ష లేకుండా సమానంగా చూడాలి.  వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉండాలి.  నాటో కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సద్ధంగా ఉండాలి. ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ ఉండాలి.  ఎలాంటి సరిహద్దు వివాదాలు ఉండకూడదు. దీంతోపాటు రక్షణ రంగంపై సభ్య దేశాలు.. తమ జీడీపీలో 2 శాతం వెచ్చించడానికి అంగీకరించాలి.  నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్‌ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్‌ 1,106 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

2008లో ప్రకటించినా.. ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఎందుకు రాలేదు..?

2008లోనే ఉక్రెయిన్‌, జార్జియా దేశాలు భవిష్యత్తులో తమ సభ్యులు అవుతాయని నాటో ప్రకటించింది. కానీ, పాలన, పారదర్శకతలో నాటో ప్రమాణాలు అందుకోవడంలో ఉక్రెయిన్‌ విఫలమైంది. ఆ దేశంలో ఉన్న అవినీతి, బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా సభ్యత్వం రాలేదు. కానీ, రష్యా నుంచి ఉక్రెయిన్‌ను కాపాడేందుకు నాటో సాయం చేస్తోంది.

2014లో రష్యా క్రిమియా ద్వీపకల్పం, తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన సమయంలో నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.  కీవ్‌ ఆత్మరక్షణకు అవసరమైన సాయం అందించడం మొదలుపెట్టాయి. కానీ, క్రిమియా ద్వీపకల్పం ఆక్రమణతో తలెత్తన సరిహద్దు వివాదం ఉక్రెయిన్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. ఆ వివాదం పరిష్కరించుకోకుండా ఉక్రెయిన్‌ నాటోలో చేరే అవకాశం లేదు.

తూర్పు ఐరోపాలో నాటో బలం ఎంత..?

నాటో ఉత్తరాన బాల్టిక్‌ నుంచి దక్షిణాన రొమేనియా వరకూ బలగాలను మోహరించిది. రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన నాటి నుంచి ఆ దళాలు ఇక్కడే ఉంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌తో సరిహద్దు పంచుకొనే సభ్యదేశాలకు రక్షణగా 40,000 స్ట్రాంగ్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను పంపాయి. ఫైటర్‌ జెట్లు, యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలతో కూడిన క్యారియర్‌ గ్రూపులను అప్రమత్తంగా ఉంచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని