Published : 18 Apr 2022 02:13 IST

Ukraine Crisis: నీట మునిగిన రష్యా అణ్వాయుధాలు..?

 ‘మాస్క్‌వా’లో రెండు వార్‌హెడ్లు ఉన్నట్లు అనుమానాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ యుద్ధనౌక నీటమునిగిన ఘటన ఇటీవల నల్లసముద్రంలో చోటు చేసుకొంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను బాగా రెచ్చగొట్టిన ఘటన కూడా ‘మాస్క్‌వా’పై దాడే. నల్ల సముద్రంలోని రష్యా దళాలకు చెందిన అత్యంత కీలకమైన నౌక ఇది. రాజధాని మాస్కో పేరిట దీనిని నిర్మించారు. ఈ నౌక ధ్వంసంతో  అణ్వాయుధాలు కూడా సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై ఎంతలేదన్నా.. రెండు అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు  అంచనావేస్తున్నారు. అంతేకాదు.. రష్యా ఆయుధ అసమర్థతగా ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఘటన ఒక్క రష్యాకే కాదు.. ప్రపంచంలో సైనిక వ్యూహకర్తలకు కూడా కొత్త సమస్యలను సృష్టించింది. 

అణు వార్‌హెడ్‌లు కూడా సముద్రంలోకి..?

మాస్క్‌వాపై మంచి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఉంది. కానీ, ఉక్రెయిన్‌ దళాలు దాడికి ముందు బైరక్తర్‌ టీబీ-2 డ్రోన్లను ప్రయోగించి రష్యా నౌక ఎయిర్‌ డిఫెన్స్‌ దృష్టి మళ్లించాయి. ఆ తర్వాత రెండు నెప్ట్యూన్‌ క్షిపణులను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశాయి. ‘ది బ్లాక్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌’ ప్రాజెక్టు మేనేజర్‌ ఆండ్రీ క్లైమెన్కో అంచనా ప్రకారం మాస్క్‌వా నౌకలో కనీసం రెండు అణు వార్‌ హెడ్లు ఉన్నాయి. కాకపోతే నౌకలో పేలుడు చోటు చేసుకొన్నాక అణ్వాయుధాలను ఏం చేశారన్న వివరాలు వెల్లడికాలేదు. ఈ నౌకపై పీ-1000 వుల్కాన్‌ క్యారియర్‌ కిల్లర్‌ క్షిపణులను అమర్చారు. దీంతో వీటికి అమర్చేలా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌’లను కూడా ఈ నౌకలో భద్రపర్చే అవకాశం ఉంది. ఇవి నీట మునిగితే  మరో ‘బ్రోకెన్‌ యారో’ ఘటనగా నిలిచే అవకాశం ఉంది. అణ్వాయుధాలకు సంబంధించి పేలుడు లేకుండా జరిగే ప్రమాదాలను అమెరికా సైన్యం బ్రోకెన్‌ యారోగా పిలుస్తుంది. దీంతో భవిష్యత్తులో నల్లసముద్ర తీరంలోని టర్కీ, రొమానియా వంటి దేశాలు రష్యాను ఈ వార్‌హెడ్లపై ప్రశ్నించే అవకాశం ఉంది.  రష్యా వద్ద 2022 నాటికి మొత్తం 6,000  అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి.

మరణాలపై గందరగోళం..

మాస్క్‌వాపై జరిగిన దాడిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంపై రష్యా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ‘టాస్‌’ న్యూస్‌ ఏజెన్సీ మాత్రం సిబ్బందిని సెవస్టపోల్‌కు తరలించినట్లు సమాచారం అందిందని పేర్కొంది. మరోవైపు ఆ దేశ రక్షణశాఖ కూడా మాస్క్‌వా సిబ్బందిగా పేర్కొంటున్న 100 మందికి పైగా ఉన్న పరేడ్‌ చిత్రాన్ని విడుదల చేసినట్లు బీబీసీ వెల్లడించింది. కానీ, కీవ్‌ మాత్రం మొత్తం 510 మంది సిబ్బంది మరణించినట్లు చెప్పుకొంటోందని డెయిలీమెయిల్‌ పత్రిక కథనంలో పేర్కొంది. అయితే, అమెరికాకు చెందిన నౌకాదళ నిపుణులు మాత్రం తమ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి దాదాపు 200 మందికిపైగా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మాస్క్‌వా మంటల్లో చిక్కుకొన్న సమయంలో రష్యా సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు ఉపగ్రహాలకు చిక్కాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నీట మునిగిన అతిపెద్ద యుద్ధనౌకల జాబితాలో మాస్క్‌వా స్థానం దక్కించుకొంది. 

చివరిసారిగా ఓ యుద్ధనౌక ఎప్పుడు మునిగింది..?

1982లో జరిగిన ఫాక్లాండ్‌ దీవుల యుద్ధంలో అర్జెంటీనాకు చెందిన జనరల్‌ బెల్‌గ్రానో అనే యుద్ధ నౌకను బ్రిటన్‌కు చెందిన అణుశక్తి సబ్‌మెరైన్‌ హెచ్‌ఎంఎస్‌ కాంకరర్‌ ఓ టోర్పిడోను ప్రయోగించి ముంచి వేసింది. ఈ ఘటనలో 323 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌక కూడా మాస్క్‌వా వలే 182 మీటర్ల పొడవుతో 12,000 టన్నుల బరువు ఉంటుంది.

దక్షిణ చైనా సముద్రాన్ని తాకిన ప్రకంపనలు..

తైవాన్‌ సైనిక శక్తితో అయినా సరే ఆక్రమించుకోవాలనుకొంటున్న చైనాకు.. మాస్క్‌వాపై దాడి ఓ హెచ్చరికలా పనిచేస్తుందని రాండ్‌ కార్పొరేషన్‌ రక్షణ రంగ పరిశోధకుడు టిమోతీ హీత్‌ పేర్కొన్నారు. భారీగా ఉండే యుద్ధనౌకలకు ఉండే బలహీనతలను ఈ ఘటన తెలియజేస్తోందని  పేర్కొన్నారు. అమెరికా, చైనాలు ఈ విషయంలో అప్రమత్తం అవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారీ ఎత్తున యుద్ధనౌకలు ఈ రెండు దేశాల వద్దే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా తన యుద్ధనౌకలను చైనా యాంటీ షిప్‌ మిసైల్స్‌ రేంజి కంటే దూరంగానే ఉంచేందుకు చూస్తుంది. అదే సమయంలో తైవాన్‌ భారీగా యాంటీ షిప్‌ మిసైల్స్‌ను కొనుగోలు చేస్తోందని చైనాకు తెలుసు. అటువంటి సమయంలో తైవాన్‌ ఆక్రమణకు చైనా తెగబడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హీత్‌ పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని