Rishi Sunak: రిషి సునాక్‌కు.. మామ నారాయణమూర్తి ఇచ్చిన సలహాలివే..!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌.. నారాయణ మూర్తి వంటి వ్యక్తి తన కుటుంబంలో ఉండడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పారు. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన రిషి.. ఏడేళ్లకే ప్రధానమంత్రి పదవి చేపట్టారు.

Published : 28 Oct 2022 01:23 IST

దిల్లీ: భారత సంతతి వ్యక్తిగా బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవిని చేపట్టి రిషి సునాక్‌ (Rishi Sunak) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికై బ్రిటన్‌ పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన.. తదుపరి ఏడేళ్లకే ప్రధాని (UK PM) పీఠాన్ని అధిరోహించారు. అయితే, మొదటిసారి ఎంపీగా గెలుపొందిన అనంతరం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మామ.. దిగ్గజ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్ఆర్‌ నారాయణమూర్తి (Narayana Murthy) గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

‘నారాయణ మూర్తి మామ కావడం సంతోషమే అయినప్పటికీ ఆయనంటే కాస్త భయం కూడా ఉంటుంది. గొప్ప సూచనలు చేస్తారు. దేవుడిపై విశ్వాసం ఉంచినప్పటికీ.. బిజినెస్‌లో సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ఎంతో ముఖ్యమని ప్రముఖ గణాంక నిపుణుడు ఎడ్వర్డ్స్‌ డెమింగ్‌ చెప్పిన మాటలను గుర్తుచేయడం నచ్చుతుంది. విలువలతో బతకాలని.. మంచి పనులు చేయాలని చెబుతుంటారు. కుటుంబంలో అటువంటి వ్యక్తి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తాను’ అని రిషి సునాక్‌ వివరించారు.

మరోవైపు రిషి సునాక్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టడంపై స్పందించిన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి.. ‘బ్రిటన్‌ ప్రజల శ్రేయస్సు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారనే విశ్వాసం ఉంది’ అని పేర్కొన్నారు.నారాయణమూర్తి కుమార్తె అక్షతాను రిషి సునాక్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు