Ukraine Crisis: యుద్ధ రంగానికి అమెరికా స్విచ్‌ బ్లేడ్‌ ఆత్మాహుతి డ్రోన్లు..!

ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సాయాన్ని అమెరికా మెల్లగా పెంచుతోంది. ఇప్పటికే జావెలిన్‌, స్టింగర్‌తో ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ను బలోపేతం చేసిన అమెరికా.. తాజాగా స్విచ్‌ బ్లేడ్‌ ఆత్మాహుతి డ్రోన్లను అందజేయనుంది. నిన్న ప్రకటించిన సైనిక సాయంలో ఇవి కూడా ఉన్నట్లు సమాచారం.

Published : 18 Mar 2022 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సాయాన్ని అమెరికా మెల్లగా పెంచుతోంది. ఇప్పటికే జావెలిన్‌, స్టింగర్‌తో ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ను బలోపేతం చేసిన అమెరికా.. తాజాగా స్విచ్‌ బ్లేడ్‌ ఆత్మాహుతి డ్రోన్లను అందజేయనుంది. నిన్న ప్రకటించిన సైనిక సాయంలో ఇవి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ డ్రోన్లు రష్యా సైనిక వాహనాల కదలికలను, కాన్వాయ్‌లను దారుణంగా దెబ్బతీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులతో రష్యన్ల ట్యాంక్‌లను దారుణంగా దెబ్బతీస్తున్న ఉక్రెయిన్‌కు మరో అస్త్రం అందినట్లవుతుంది. స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లతో కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే శత్రువులపై విరుచుకుపడే అవకాశాన్ని ఈ డ్రోన్లు కల్పిస్తాయి. 

ఏమిటీ ఆత్మాహుతి ఆయుధం..

అమెరికాకు చెందిన ఏరో వైర్మాన్మెంట్‌ సంస్థ  ది స్విచ్‌ బ్లేడ్‌ పేరుతో డ్రోన్లను తయారు చేస్తోంది. దీనిలో స్విచ్‌ బ్లేడ్‌ 300, స్విచ్‌ బ్లేడ్‌ 600 రకాలు ఉన్నాయి. ప్రిడేటర్‌లా విమానం సైజులో ఉండవు. ఇవి అతి చిన్న సైజులో ఉన్న  లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ (గాల్లో చక్కర్లు కొడుతూ.. లక్ష్యం కనిపించగానే దానిపై పడి దాడి చేసేది). వీటిని కామికాజె(ఆత్మాహుతి) డ్రోన్ల కేటగిరిగా పేర్కొంటారు. ఈ డ్రోన్లను సైనికుడు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని కూడా ప్రయాణించవచ్చు. ఈ డ్రోన్లను కొండల్లో, సముద్రాల్లో, గాల్లో నుంచి శత్రువుకు దూరంగా ఉండి ప్రయోగించవచ్చు.  ప్రయోగించిన తర్వాతే దీని రెక్కలు విచ్చుకొని గాల్లో డ్రోన్‌లా ఎగురుతుంది. అందుకే స్విచ్‌ బ్లేడ్‌ అని పేరుపెట్టారు. ఇది ఒక సైనిక వాహనాన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు దీని ఆపరేటర్‌కు రియల్‌ టైమ్‌ వీడియో లింక్‌ను కూడా అందిస్తుంది. ఆపరేటర్‌కు యుద్ధక్షేత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ డ్రోన్‌ను ప్రత్యేకమైన ట్యూబ్‌ నుంచి లాంఛ్‌ చేయవచ్చు.

‘స్విచ్‌బ్లేడ్‌ 300’ డ్రోన్లు కేవలం 2.5 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. వీటి పొడవు 24 అంగుళాలు. ఇవి 10 కిలోమీటర్ల అవతల లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇది 500 అడుగుల కంటే తక్కువ ఎత్తులో 10 నిమిషాలు గాల్లో ఎగరగలదు. ఈ డ్రోన్‌ను కేవలం రెండు నిమిషాల్లో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. దీనిలో కెమెరాలు కూడా ఉంటాయి. కానీ, మరో చిన్న కెమెరా డ్రోన్‌ను దీనికి సహాయంగా తరచూ ప్రయోగిస్తుంటారు. ఈ రెండింటినీ సెన్సార్‌ టూ షూటర్‌ అనే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానిస్తారు. ఈ డ్రోన్‌లో పేలుడును ఆపరేటర్‌ నియంత్రించవచ్చు. కేవలం వాహనంలో లక్ష్యంగా మార్చుకొన్న వ్యక్తిని మాత్రమే హతమార్చేలా మార్చవచ్చు.  దీని ధర 6,000 డాలర్లు వరకు ఉంది. 

అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌లో ఈ డ్రోన్‌లను తాలిబన్లపై దాడులకు వాడింది.  ప్రస్తుతానికి వీటిని అమెరికా మాత్రమే వినియోగిస్తోంది. కచ్చితమైన వీఐపీ లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని వినియోగిస్తారు. అఫ్గానిస్థాన్‌లో పుట్టిన వాహిబ్‌ నవాబీ ఏరో వైర్మాన్మెంట్‌ సీఈవోగా చేయడం విశేషం.  ‘యాంగ్రీబర్డ్‌’, ‘బజ్జింగ్‌ బీ’లా ఇది తాలిబన్లపై విరుచుకుపడిందని ఆయన వెల్లడించారు. 

40 కి.మీ. దూరంలో లక్ష్యాల కోసం స్విచ్‌బ్లేడ్‌ 600

ఈ రకం డ్రోన్లలో 600 వేరియంట్‌ను 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వాడతారు. దీని బరువు 23 కిలోలు. దీనిలో డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ ఆప్టికల్‌ ఇన్ఫ్రారెడ్‌ సెన్సర్‌ సూట్‌ను అమర్చారు. దీనిపై యాంటీ ఆర్మర్‌ (కవచాలను ఛేదించే)వార్‌ హెడ్‌ను అమర్చవచ్చు. దీనిలో పేలుడు శక్తిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా సముద్రంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని వాడతారు. స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లు.. టర్కీకి చెందిన బైరక్తర్‌ టీబీ-2 డ్రోన్ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. దీనిని 10 నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్చు. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. 20 నిమిషాల్లో 40 కిలోమీటర్ల అవతల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీని ఫైర్‌ కంట్రోల్‌ కోసం టచ్‌స్క్రీన్‌ టాబ్లెట్‌ను వినియోగించవచ్చు. 

అమెరికా నుంచి భారీ ఆయుధ కన్సైన్‌మెంట్‌..!

తాజాగా 800 మిలియన్‌ డాలర్ల సైనిక సాయంలో భాగంగా 800 స్టింగర్‌ క్షిపణులు, 100 ఆత్మాహుతి స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లు, దాదాపు 2 కోట్ల చిన్న ఆయుధాలు మందుగుండు, మోర్టార్‌ రౌండ్లు, 25 వేల శరీర కవచాలు, 25 వేల హెల్మెట్లు, 100 గ్రనేడ్‌ లాంఛర్లు, 5,000 రైఫిల్స్‌, 1,000 పిస్టోల్స్‌, 400 మిషిన్‌ గన్స్‌, 400 షాట్‌ గన్లతో పాటు 2,000 జావెలిన్‌, 1,000 లైట్‌ యాంటీ ఆర్మర్‌ ఆయుధాలు, 6,000 ఏటీ-4 యాంటీ ఆర్మర్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని