Ukraine Crisis: విమానాన్నే హైజాక్‌ చేయించిన అధ్యక్షుడు..!

ఇటీవల పుతిన్‌ అణువిన్యాసాలను సిచ్యూవేషన్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తున్న సమయంలో పక్కనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అలెగ్జాండర్‌ లుకషెంకో. బెలరస్‌ అధ్యక్షుడు.

Published : 22 Feb 2022 01:42 IST

 వివాదాలకు కేంద్ర బిందువుగా బెలారస్‌ నియంత

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణువిన్యాసాలను సిచ్యువేషన్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తోన్న సమయంలో పక్కనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అలెగ్జాండర్‌ లుకషెంకో. బెలారస్‌ అధ్యక్షుడు. ఐరోపా ఖండంలో చివరి నియంతగా ఆయన ఘనమైన అపకీర్తి మూటగట్టుకొన్నారు.  గ్రీస్‌ నుంచి లిథివేనియాకు వెళుతున్న ఓ విమానాన్ని గతేడాది బలవంతంగా బెలారస్‌లో ల్యాండ్‌ చేయించడం వెనుక ఆయన హస్తం ఉంది. ఆ తర్వాత బెలారస్‌ భద్రతా సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. తీరా తేలిసిందేంటంటే సదరు వ్యక్తి పేరు రోమన్‌ ప్రోటాసెవిచ్‌. అతడో జర్నలిస్టు. బెలారస్‌ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కథనాలు వెలుగులోకి తెస్తున్నాడు. దీంతో భద్రతా దళాలు పట్టుకొంటాయని దేశాన్ని వీడి లిథివేనియాలో ఆశ్రయం పొందుతున్నాడు. అతడిని పట్టుకోవడం కోసం మిగ్‌-29 విమానాన్ని పౌర విమానంపైకి ఉసిగొల్పి బలవంతంగా ల్యాండ్‌ చేయించి ప్రోటాసెవిచ్‌ను అరెస్టు చేశారు. ఓ రకంగా విమానాన్ని హైజాక్‌ చేయడమే. ఈ ఘనకార్యం చేయించింది స్వయాన అధ్యక్షుడు లుకషెంకోగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా బెలారస్‌ను పట్టి పీడిస్తున్నాడు. ఇటీవల ఉక్రెయిన్‌ సంక్షోభం తారస్థాయిలో ఉన్న సమయంలో రష్యాకు మద్దతుగా నిలిచాడు. ఏకంగా సూపర్‌ అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ప్రపంచాన్ని బెదిరించాడు.

ఎవరీ అలెగ్జాండర్‌ లుకషెంకో..?

అలెగ్జాండర్‌ లుకషెంకో (67) సోవియట్‌ యూనియన్‌ ఉన్న సమయంలో సైన్యంలో, కమ్యూనిస్టు పార్టీ యూత్‌ వింగ్‌లో పనిచేశారు. సోవియట్‌ నుంచి బెలారస్‌ వేరుపడ్డాక 1990లో బెలారస్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సోవియట్‌ నుంచి విడిపోవడాన్ని వ్యతిరేకించిన ఏకైక డిప్యూటీ కూడా ఇతనే.  అదే సమయంలో అవినీతి నిరోధక కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఈ సమయంలో నాటి బెలారస్‌ అధ్యక్షుడు, ప్రధానితో సహా అందరిపై అవినీతి ఆరోపణలు చేసి.. వారి రాజకీయ భవిష్యత్తును అంతం చేశాడు. 1994లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర బెలారస్‌ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తనను తాను ప్రజల రాజకీయ నాయకుడిగా చెప్పుకొన్నాడు.  1996లో అధ్యక్షుడి అధికారాల పరిధి పెంచేందుకు ఓటింగ్‌ నిర్వహించాలని భావించాడు. కానీ, ఐరోపా దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో అమెరికా, ఐరోపా సమాఖ్య దౌత్యవేత్తలను దేశ బహిష్కరణ చేశాడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఎన్నికల అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికారాన్ని గుప్పిట పెట్టుకొనే చర్యలతో బెలారస్‌ను బంధించాడు. 2020లో ఆరోసారి కూడా తాను ఎన్నికల్లో 80శాతం ఓట్లతో గెలిచినట్లు లుకషెంకో ప్రకటించుకోగా.. భారీ ఎత్తున అల్లర్లకు దారి తీసింది. కానీ, వాటిని అతడు నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. దీంతో ప్రతిపక్ష నాయకురాలు స్వెత్లానా దేశం విడిచి పారిపోయారు. అదే సమయంలో జర్నలిస్టు రోమన్‌ ప్రోటాసెవిచ్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాడు. అయితే.. ఈ ఎన్నికలు పూర్తిగా బూటకమని పశ్చిమ దేశాలు పెదవి విరిచాయి. కానీ, రష్యా మాత్రం లుకషెంకోకు మద్దతగా నిలిచింది. ఆ తర్వాత ప్రోటాసెవిచ్‌ను అరెస్టు చేసేందుకు ఏకంగా మిగ్‌-29 సాయంతో విమానాన్ని హైజాక్‌ చేయించాడు. అంతర్జాతీయ నిబంధనలకు ఈ ఘటన ఓ అవమానం అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు.

రష్యాకు బలమైన మద్దతుదారే.. కానీ..

రష్యా- నాటో సభ్య దేశాల మధ్య అడ్డుగా బెలారస్‌ ఉంటుంది. ఇదే బెలారస్‌ను రష్యాకు బాగా దగ్గర చేసింది. మరోవైపు బాల్టిక్‌ సముద్రం ఒడ్డునున్న రష్యా భూభాగమైన కలిన్‌గ్రాడ్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లుకషెంకోకు రష్యా నుంచి రాజకీయ మద్దతు లభిస్తోంది. పశ్చిమ దేశాలను ఎదుర్కోవడంలో ఇది ఉపయోగపడుతోంది. కానీ, బెలారస్‌ను తిరిగి రష్యాలో చేర్చడానికి మాత్రం లుకషెంకో అంగీకరించడు.

2009లో రష్యాతో ఒక దశలో చెడి..

2009లో రష్యాతో లుకషెంకో సంబంధాలు దెబ్బతిన్నాయి. జార్జియాలోని రెండు విడిభాగాల స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తే 500 మిలియన్‌ డాలర్లు ఇస్తామని రష్యా ఆశచూపినట్లు ప్రకటించారు. అంతేకాదు బెలారస్‌ ప్రజలు ఆ రెండు తిరుగుబాటు ప్రాంతాలకు వెళితే జార్జియా చట్టాలను మాత్రమే గౌరవించాలని పేర్కొన్నాడు. రష్యాను వదిలి సంతోషంగా మిగిలిన ప్రపంచాన్ని బెలారస్‌ చూస్తుందని ప్రకటించాడు. అదే సమయంలో బెలారస్‌ నుంచి పాల దిగుమతిని రష్యా అడ్డుకొంది. ఈ వివాదం ముదిరి రష్యా నేతృత్వంలోని సీఎస్‌టీవో (కలెక్టీవ్‌ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సమావేశానికి బెలారస్‌ హాజరు కాలేదు. కానీ, 2012లో బెలారస్‌ పై ఐరోపా సమాఖ్య ఆంక్షలను పుతిన్‌ బహిరంగంగా విమర్శించడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి.

కరోనాపై కారుకూతలు..

కరోనా వ్యాప్తి సమయంలో బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేసిన ఘనత లుకషెంకోకు దక్కుతుంది. ఓవైపు ప్రపంచం వైరస్‌కు వణికిపోతుంటే ఈయన మాత్రం తాపీగా ప్రవర్తించాడు. బెలారస్‌ ప్రజలు వోడ్కా తాగాలని, వారానికి రెండు సార్లు ఆవిరి స్నానాలు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఒలింపిక్‌ అథ్లెట్‌ను వేధించి..

ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో బెలారస్‌ తరఫున పాల్గొన్న మహిళా స్ప్రింట్‌ రన్నర్‌ క్రిస్టియానా సిమనోస్కాయ భయంతో ఆ క్రీడల అనంతరం శరణార్థిగా పోలాండ్‌కు వెళ్లిపోయింది. ఆమె 100 మీటర్లలో క్వాలిఫై అయ్యింది.. 200 మీటర్ల పోటీ జరగాల్సిన సమయంలో బెలారస్‌ అధికారులు వచ్చి ఆమె మానసిక ఆరోగ్యం బాగోలేదు.. క్రీడల్లో పాల్గొనదు అంటూ ఒలింపిక్‌ కమిటీకి సమాచారం ఇచ్చారు. కానీ, కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ దీనిని తిరస్కరించింది. ఆమె క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, అదే సమయంలో ఆమె ప్రాణభయంతో ఇతర దేశాల్లో ఆశ్రయం పొందేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. కోచ్‌లను, అధ్యక్షుడిని విమర్శించిందని బెలారస్‌ అధికారులు ఆమెపై ఆరోపణలు చేశారు.

ఆమె దయనీయ స్థితి తెలుసుకొని చాలా దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కానీ, ఆమె పోలాండ్‌ వీసాను స్వీకరించారు. ఆ తర్వాత ఆమె పోలాండ్‌ చేరుకొని జీవిస్తున్నారు. తాను సురక్షితంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. పోలీష్‌, జపాన్‌ అధికారులు ఆమెకు చేసిన సాయాన్ని ప్రపంచ దేశాలు అభినందించాయి.

ఐరోపాను భయపెట్టే అవకాశం..

అమెరికా-పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేందుకు బెలారస్‌ రష్యాపై ఆధారపడింది. ఈ క్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే శరణార్థులను ఐరోపాలోకి పంపిస్తామని బెలారస్‌ తరచూ బెదిరింపులకు దిగుతుంటుంది. తాజాగా ఉక్రెయిన్-రష్యా వివాదం ముదరడంతో రష్యా పక్షాన చేరి ఏకంగా అణుబెదిరింపులకు పాల్పడింది. దీంతోపాటు ఉక్రెయిన్‌ను భయపెట్టేందుకు వచ్చిన 30వేల మంది రష్యా సైనికులకు ఆశ్రయం ఇచ్చింది. అవసరమైతే అణ్వాయుధాలను మోహరించేందుకు కూడా అనుమతులు ఇస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని