Ukraine Crisis: ‘జీ20’లో జెలెన్‌స్కీ మాట్లాడిన వేళ.. ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం!

జీ-20 వేదికగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన వేళ.. ఆ దేశంపై రష్యన్‌ సేనలు మరోసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా మంగళవారం క్షిపణుల వర్షం కురిపించాయి.

Published : 16 Nov 2022 02:19 IST

కీవ్‌: జీ-20(G20 Summit) వేదికగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన వేళ.. ఆ దేశంపై రష్యన్‌ సేనలు మరోసారి భీకర దాడుల(Russian Strikes)తో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా మంగళవారం క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో రాజధాని కీవ్‌ సహా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సైరన్‌ల మోతలు మోగాయి. కీవ్‌లోని పెచెర్స్క్ డిస్టిక్‌పై జరిపిన క్షిపణి దాడుల్లో పలు నివాస భవంతులు ధ్వంసమయ్యాయని నగర మయర్‌ విటాలీ క్లిట్‌ష్కో వెల్లడించారు. గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కీవ్‌పై ప్రయోగించిన పలు రష్యన్‌ క్షిపణులను నేలకూల్చినట్లు తెలిపారు. ఇది రష్యా పనేనంటూ జెలెన్‌స్కీ కార్యాలయ డిప్యూటీ హెడ్ కిరిలో తిమోషెంకో ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘జీ-20 సమావేశంలో మాట్లాడినందుకే..!’

తాజా దాడులతో.. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌, ల్వివ్‌ సహా ఉక్రెయిన్‌వ్యాప్తంగా ఆయా చోట్ల విద్యుత్‌ సరఫరాలో ఆటంకం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. సుమీ తూర్పు ప్రాంతంలో, పశ్చిమాన ఉన్న రివ్నేలో ఇంధన వసతులే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపారు. జెలెన్‌స్కీ ఆన్‌లైన్‌ వేదికగా జీ-20 సదస్సులో మాట్లాడినందుకే.. ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు ప్రెసిడెన్షియల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ యాండ్రీ యెర్మక్‌ ఆరోపించారు. సైనిక చర్య ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్‌స్కీ ఆ సందర్భంగా జీ-20 నేతలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘మాస్కో నిజంగా శాంతిని కోరుకుంటోందని ఎవరైనా భావిస్తున్నారా? అది కేవలం తాను చెప్పిందే చేయాలని భావిస్తోంది. ఏదేమైనా.. అఖరుకు ఉగ్రవాదులు ఓడిపోతారు’ అని యెర్మక్ అన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని