H-1B visa: నేనొస్తే.. ‘లాటరీ’ విధానానికి స్వస్తి..! వివేక్‌ రామస్వామి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. హెచ్‌ 1బీ వీసా లాటరీ విధానానికి స్వస్తి చెబుతానని రిపబ్లికన్‌ నేత వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు.

Updated : 17 Sep 2023 17:00 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతోన్న భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy).. కీలక హామీలతో ముందుకెళ్తున్నారు. తాను అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌బీఐని (FBI) మూసివేస్తానని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో సంచలన ప్రకటన చేసిన రామస్వామి.. తాను అధికారంలోకి వస్తే లాటరీ ఆధారిత హెచ్‌-1బీ వీసా ప్రక్రియకు స్వస్తిచెప్పి దాని స్థానంలో ప్రతిభ ఆధారిత (Meritocratic Admission) విధానాన్ని తెస్తానని పేర్కొన్నారు.

Vivek Ramaswamy: 75% ఉద్యోగులను తొలగిస్తా.. FBIని మూసేస్తా!

‘ప్రస్తుతం లాటరీ విధానంలో (Lottery-based System) ఉన్న వీసా (H-1B) ప్రక్రియను మెరిట్‌ ఆధారిత వ్యవస్థలోకి మార్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత విధానం స్పాన్సర్‌ చేసే సదరు కంపెనీకే ప్రయోజనం కలిగించేదిగా ఉంది. ఇది ఒప్పంద సేవ (Indentured Servitude) వంటిది. దానికి నేను స్వస్తి పలుకుతాను’ అని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా గొలుసు ఆధారిత వలసలను నిర్మూలించాల్సిన అవసరం అమెరికాకు ఉందని రామస్వామి చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దేశానికి నైపుణ్య సహకారం అందించే వలసదారుల కుటుంబీకులు మాత్రం మెరిట్‌ ఆధారంగా రావడం లేదన్నారు.

29సార్లు వినియోగించుకొని..

లాటరీ ఆధారిత హెచ్‌ 1బీ వీసాకు ముగింపు పలుకుతానన్న వివేక్‌ రామస్వామి.. ఈ అవకాశాన్ని 29సార్లు వినియోగించుకోవడం గమనార్హం. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సేవల (USCIS) ప్రకారం.. గతంలో రామస్వామికి చెందిన రోవాంట్‌ సైన్సె్స్‌ ఉద్యోగుల నియామకానికి సంబంధించి 2018 నుంచి 2023 వరకు హెచ్‌ 1బీ కింద 29 దరఖాస్తులను ఆమోదించింది. అయినప్పటికీ ఈ విధానం సరిగ్గా లేదని వివేక్‌ రామస్వామి చెప్పినట్లు అమెరికా వార్తా పత్రిక ‘పొలిటికో’ పేర్కొంది. అయితే, రోవాంట్‌ సైన్సెస్‌కు గతంలో సీఈవోగా ఉన్న రామస్వామి.. 2021 ఫిబ్రవరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించేంత వరకు ఆ సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు ఛైర్మన్‌గా కొనసాగారు. అమెరికా ఎస్‌ఈసీ ప్రకారం.. ప్రస్తుతం ఆ సంస్థలో 904 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 825 మంది అమెరికన్లు ఉన్నారు.

పెంపుకోసం ప్రయత్నాలు..

టెక్‌ దిగ్గజ సంస్థలు ఏటా వేల మందిని హెచ్‌ 1బీ వీసా కింద అమెరికాకు పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏటా భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. 2021 గణాంకాల ప్రకారం, అక్కడ 85వేల మందికి అవకాశం ఉండగా.. సుమారు 8లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఇచ్చే 85 వేలల్లో 65 వేలు అందరికీ అందుబాటులో ఉంటుండగా.. 20 వేల వీసాలు మాత్రం అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారే పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వీసాలపై కఠిన వైఖరి అవలంబించిన డొనాల్డ్‌ ట్రంప్.. వీటి సంఖ్యను నిరోధించే ప్రయత్నం చేశారు.

అయితే, వీటి సంఖ్యను పెంచాలని డిమాండ్‌ వస్తోంది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.. వీటి సంఖ్యను రెట్టింపు చేసే బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌ 1బీ వీసాల కోటాను 65 వేల నుంచి 1.30 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఏటా జారీ చేసే వీసాల్లో మూడోవంతు భారతీయ నిపుణులే దక్కించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని