Bidens Asia trip: బైడెన్‌ పర్యటనకు కిమ్‌ అణుపరీక్ష ముప్పు..!

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆసియా పర్యటన శ్వేతసౌధంలో టెన్షన్‌ పెంచుతోంది. ఆయన తన పర్యటనలో భాగంగా జపాన్‌, దక్షిణ కొరియాలను సందర్శించనున్నారు.

Published : 20 May 2022 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆసియాలో తలపెట్టిన పర్యటన శ్వేతసౌధంలో టెన్షన్‌ పెంచుతోంది. ఆయన ఈ పర్యటనలో భాగంగా జపాన్‌, దక్షిణ కొరియాలను సందర్శించనున్నారు. గురువారం నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులేవాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘మా ఇంటెలిజెన్స్‌ నుంచి నమ్మకమైన సమాచారం ఉంది. దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష లేదా అణు పరీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ రెండు జరగవచ్చు. అధ్యక్షుడి పర్యటన సమయంలో గానీ, తర్వాత గానీ ఇవి జరిగే అవకాశం ఉంది’’ అని ఆయన ఉత్తర కొరియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా కొన్నాళ్లుగా ఉ.కొరియా అణుపరీక్షలు నిర్వహించవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. 

ద.కొరియా, జపాన్‌లో ఉండగా హఠాత్తుగా ఎదురయ్యే ఎటువంటి కవ్వింపు చర్యలనైనా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశామని సులేవాన్‌ వెల్లడించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం తమ వ్యూహాత్మక ప్రయోజనాల్లో కీలక భాగమని వెల్లడించేందుకు బైడెన్‌ ఆసియా పర్యటన చేపట్టారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన నాటి నుంచి ఆయన పూర్తిగా రష్యాపై దృష్టిపెట్టారు.

బైడెన్‌ తన పర్యటనలో భాగంగా గురువారం దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌తో భేటీ కానున్నారు. రెండు కొరియాల మధ్య ఉన్న నిస్సైనిక మండలాన్ని మాత్రం ఆయన సందర్శించరని శ్వేతసౌధం సెక్రటరీ జెన్‌సాకీ వెల్లడించారు. క్వాడ్‌ భేటీ కోసం బైడెన్‌ ఆదివారం జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ భేటీలో ఆస్ట్రేలియా, భారత్‌ కూడా పాల్గొననున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని