Joe Biden: అవన్నీ ‘చీప్‌ఫేక్’ క్లిప్స్‌: బైడెన్‌ ఆరోగ్యంపై అనుమానాల వేళ వైట్‌హౌస్‌ ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు బైడెన్(Joe Biden) ఆరోగ్యంపై వస్తోన్న విమర్శలపై వైట్‌ హౌస్‌ స్పందించింది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న దృశ్యాలన్నీ వక్రీకరించినవని వెల్లడించింది. 

Updated : 18 Jun 2024 16:58 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆరోగ్యంపై ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఆయన ఆరోగ్యం గురించి అనుమానాలు వ్యక్తమయ్యే రీతిలో పలు వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా వైట్‌హౌస్‌ స్పందించింది. విపక్ష రిపబ్లికన్‌ పార్టీ నేతల వైఖరిని విమర్శించింది.

అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్‌తో భేటీకి ముందు పుతిన్‌

‘‘రిపబ్లికన్లు ఎంత నిరాశలో ఉన్నారో కనిపిస్తోంది. దృశ్యాలను వక్రీకరించి, ఆ పార్టీకి చెందిన కొందరు వ్యాప్తి చేస్తున్నారు. అవి చీప్‌ఫేక్ వీడియోలు’’ అంటూ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ విమర్శించారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు బైడెన్ హాజరయ్యారు. మిగిలిన ప్రపంచనేతలంతా ఒకవైపు ఉంటే.. బైడెన్ మాత్రం మరోవైపు తిరిగి, ముందుకు వెళ్లడమే కాకుండా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ వీడియోలో అటువైపు ఎవరూ లేరు. ఇంతలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయన్ను మిగతా నేతలంతా ఉన్నదగ్గరికి తీసుకువచ్చారు. దీనిపై ప్రెస్‌ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఇతరులతో మాట్లాడేందుకు బైడెన్ అటువైపు వెళ్లారని చెప్పారు. కన్జర్వేటివ్ మీడియా కూడా దీనిని ఫ్యాక్ట్‌ చెక్ చేసిందన్నారు.

అలాగే ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడు ఎలాంటి చలనం లేకుండా నిల్చుండిపోయారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. ‘‘ఆయన అక్కడ నిల్చొని సంగీతం వింటున్నారు. డ్యాన్స్ వేయలేదు. డ్యాన్స్ తెలియకపోవడం కూడా ఒక ఆరోగ్య సమస్య అని తెలియదు’’ అని వైట్‌హౌస్‌ సమర్థించింది. ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌లో డెమోక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్‌ (Biden), ఒబామా కలిసి పాల్గొన్నారు. ఇంటర్వ్యూ అనంతరం ఇరువురు నేతలు తమ మద్దతుదారులకు అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు సిద్ధంకాగా.. బైడెన్‌ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి తీసుకెళ్లారు. ఇలా వరుసగా బైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడం అధికార డెమోక్రాట్లకు ఇబ్బందిగా మారింది. అయితే, 81 ఏళ్ల వయసులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఇటీవల ఆయన సతీమణి జిల్ బైడెన్ వెల్లడించడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు