మరో గుర్తుతెలియని వస్తువును కూల్చిన అమెరికా.. ఈసారి కెనడాలో

US shoot down Unidentified Object: కెనడా గగనతలంలో ఎగురుతున్న మరో గుర్తుతెలియని వస్తువును అమెరికా శనివారం కూల్చివేసింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.

Published : 12 Feb 2023 11:35 IST

వాషింగ్టన్‌: అమెరికా (America) సమీపంలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువులు (Unidentified Object) ఇప్పుడు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా కెనడా (Canada) గగనతలంలో ఎగురుతున్న మరో వస్తువును అమెరికా (America) యుద్ధవిమానం కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఆమోదం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం శ్వేతసౌధం ప్రకటించింది.

అంతకుముందు ఉత్తర అలాస్కా తీరప్రాంత గగనతలంలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ శుక్రవారం ప్రకటించింది.  అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశానుసారం ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ఇలా రెండు రోజుల వ్యవధిలో రెండు వస్తువులను అమెరికా కూల్చివేయడం గమనార్హం. వారం క్రితం చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ను సైతం అమెరికా కూల్చివేసిన విషయం తెలిసిందే.

యుకోన్‌లోని కెనడా (Canada) సేనలు కూలిన వస్తువు శకలాలను సేకరించి విశ్లేషించనున్నట్లు ట్రూడో (Justin Trudeau) వెల్లడించారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు, రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు చైనా నిఘా బెలూన్‌ ఘటనకు స్పందనగా అమెరికా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆ దేశానికి చెందిన ఆరు సంస్థలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని