TikTok: వాటి నుంచి టిక్‌టాక్‌ను తొలగించండి..!

టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలోని ప్రభుత్వ కార్యాలయాల ఫోన్లు, ఇతర పరికరాల నుంచి ఆ యాప్‌ను తొలగించాలనే ఆదేశాలు వెలువడ్డాయి. 

Published : 06 Mar 2023 18:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వకార్యాలయాల్లో ఉపయోగించే పరికరాల నుంచి టిక్‌టాక్‌(TikTok) యాప్‌ను తొలగించాలని అమెరికా(USA) ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 30 రోజుల గడువు విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటి నుంచి సదరు కంపెనీకి ఎటువంటి ట్రాఫిక్‌ వెళ్లకూడదని అమెరికాలోని ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌ షాలంద యంగ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఆఫీసులకు మార్గదర్శకాలను పంపించారు. గతేడాది అమెరికా కాంగ్రెస్‌ ఈ బ్యాన్‌ను విధించింది. తర్వాత అమెరికా మిత్ర రాజ్యాలైన కెనడా, ఐరోపా సమాఖ్య, తైవాన్‌  వంటివి కూడా దీనిని అనుసరించాయి. 

తాజాగా ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్‌ బ్యాన్‌ సదరు యాప్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో యాప్‌పై అమెరికాలో గంపగుత్తగా నిషేధం విధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తమ గగనతలంపై చైనా బెలూన్‌ సంచరించిన ఘటన తర్వాత అమెరికా కఠిన వైఖరి అవలంభిస్తోంది. శ్వేతసౌధం నిర్ణయంపై ఇప్పటి వరకు టిక్‌టాక్‌ స్పందించలేదు. ప్రస్తుతం అమెరికాలో  టిక్‌టాక్‌కు 100 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. 

గత డిసెంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ ఫోన్లు, ఇతర పరికరాల్లో వినియోగించడానికి నిషేధించడానికి అనుకూలంగా ఓటువేసింది. దీంతో ఏజెన్సీలు అన్నీ తమ ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి అమలు చేయడానికి  బైడెన్‌ సర్కారు 60 రోజుల సమయం ఇచ్చింది. ‘‘దేశ డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను, ప్రజల వ్యక్తిగత గోప్యత, రక్షణను బలోపేతం చేయడానికి తీసుకొంటున్న చర్యల్లో ఇవి ఒక భాగమని’’ ఫెడరల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ క్రిస్‌ డిరష్‌ పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఓటింగ్‌కు ముందే.. అమెరికాలోని శ్వేతసౌధం, రక్షణశాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ టిక్‌టాక్‌ను నిషేధించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని