WHO: ఆ రెండు దగ్గుమందులు వాడొద్దు.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

మరియన్ బయోటెక్ సంస్థలో తయారైన రెండు దగ్గుమందులను చిన్నారులకు వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. అవి నాణ్యతా ప్రమాణాలు అందుకోలేదని తెలిపింది. 

Published : 12 Jan 2023 10:53 IST

జెనీవా: భారత్‌లో తయారైన దగ్గుమందుకు ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)స్పందించింది. నోయిడా(Noida)కు చెందిన మరియన్ బయోటెక్(Marion Biotech) సంస్థ ఉత్పత్తి  చేసిన రెండు దగ్గు మందులను ఉజ్బెకిస్థాన్‌(Uzbekistan) లోని చిన్నారులకు వాడొద్దని హెచ్చరించింది. 

‘ఈ మరణాల నేపథ్యంలో భారత్‌లోని ‘మరియన్‌ బయోటెక్’ తయారు చేసిన దగ్గుమందులను చిన్నారులకు  వాడకూడదని సూచిస్తున్నాం. ఆ రెండు దగ్గుమందుల పేర్లు ‘అబ్రోనాల్‌’, ‘డాక్‌-1మ్యాక్స్‌’. ప్రయోగశాలల నివేదిక ప్రకారం.. దగ్గుమందులో పరిమితికి మించి డైఇథిలిన్‌ గ్లైకాల్‌, ఇథిలిన్‌ ఉన్నాయి. ఈ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకమైనవి. నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తన ప్రకటనలో పేర్కొంది.  

మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన ‘డాక్‌-1 మాక్స్‌’ సిరప్‌ తాగిన  పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఇటీవల ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. 21 మంది పిల్లల్లో 18 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో దానిని తీసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది. కొన్ని నెలల క్రితం కూడా ఈ తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా పనిచేసే  ‘మైడెన్‌ ఫార్మా’ కంపెనీ ఉత్పత్తిచేసిన సిరప్‌లు వినియోగించి గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని