Omicron Sub variants: ఒమిక్రాన్‌లో మార్పులపై WHO ఆందోళన.. తర్వాత ఏం వస్తుందో..?

కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో చోటుచేసుకుంటోన్న ఉత్పరివర్తనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 05 May 2022 12:38 IST

జెనీవా: కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో చోటుచేసుకుంటోన్న ఉత్పరివర్తనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ బీఏ.2 ఉనికి చాటుతున్నప్పటికీ.. బీఏ.4, బీఏ.5 సబ్‌ వేరియంట్లు దక్షిణాఫ్రికాలో కొత్త ఉప్పెనకు దారితీస్తున్నాయని వెల్లడించారు. చాలా దేశాల్లో ఈ వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేకపోతున్నామని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించారు. 

గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. నాటి నుంచి వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం వెలుగుచూస్తోన్న కొత్త కేసుల్లో ఈ వేరియంటే అత్యధికంగా కనిపిస్తోంది. కాగా, ఈ వేరియంట్ ఉపరకాలు ఉత్పరివర్తన చెందుతుండటంతో వాటి లక్షణాల్లో మార్పు కనిపిస్తోందని ఆరోగ్య సంస్థ తాజాగా నివేదికలో పేర్కొంది. ‘బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియంట్లు దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చాయి. మిగిలిన దేశాలు జన్యుక్రమాన్ని విశ్లేషించడాన్ని మానివేయగా.. దక్షిణాఫ్రికా ఇంకా దానిని కొసాగిస్తోంది. అందుకే, వాటిని గుర్తించగలిగాం. వ్యాక్సినేషన్.. ప్రజలను రక్షించుకోవడావడానికి మనముందున్న మార్గం. దాంతో పాటు కొవిడ్ నియమావళిని పాటించాలి’ అంటూ టెడ్రోస్‌ వెల్లడించారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. గత వారం 15 వేల మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. ఈ రెండేళ్ల కాలంలో 62 లక్షలకు పైగా మరణాలు సంభవించగా.. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల సానుకూల పరిణామమే అయినప్పటికీ.. పలు దేశాల్లో పరీక్షల సంఖ్య తగ్గడం కారణం కావొచ్చన్నారు. అలాగే అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని