Published : 13 Aug 2022 15:47 IST

Salman Rushdie: ఎవరీ హాది మతార్‌.. సల్మాన్‌ రష్దీపై ఎందుకు దాడికి పాల్పడ్డాడు..?

న్యూయార్క్‌: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(75)పై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్ర గాయాలపాలైన రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్నారని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి కత్తితో రచయితపై దాడి చేసింది ఓ యువకుడు. అతడిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హాది మతార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే, ఎవరీ మతార్‌? ఎందుకు రష్దీపై దాడికి పాల్పడ్డాడు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

న్యూజెర్సీలో నివసించే మతార్‌(24)కు సంబంధించి సోషల్‌ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలించారు.  అతడు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC)కు సానుభూతిపరుడని ఆ సామాజిక మాధ్యమాలు తెలియజేస్తున్నాయి. మతార్‌కు, ఐఆర్‌జీసీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనప్పటికీ.. నిందితుడి సెల్‌ఫోన్‌లో 2020లో హత్యకు గురైన ఇరాన్ కమాండర్ ఖాసేమ్ సోలేమాని చిత్రాలను గుర్తించారు. ఇదిలా ఉంటే.. రష్దీ రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మేరకు.. మతార్‌కు ఎలాంటి గ్రూపులతో సంబంధాలు లేవని, ప్రస్తుతం అతడు ఒంటరిగానే పనిచేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పలు వస్తువుల కోసం సెర్చ్ వారెంట్లు పొందే ప్రక్రియలో ఉన్నారు. పోలీసులు మరిన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. రష్దీపై దాడికి ప్రేరేపిత కారణాలేంటి? మతార్‌ ఏ దేశానికి చెందినవాడు? అతడిపై ఇప్పటివరకు క్రిమినల్‌ రికార్డు ఉందా? ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ నిన్న హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే స్టేజిపైకి దూసుకొచ్చిన మతార్‌ ఆయనపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన రచయితను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. బుకర్‌ ప్రైజ్‌ విజేత అయిన రష్దీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే, ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని