Corona Virus: ఈ దేశాల్లో కరోనా కేసులు ‘సున్నా’.. అవేంటో తెలుసా..?

గత రెండేళ్లుగా యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేసింది. అనేక దేశాల్లో వైరస్‌ విలయతాండవం చేసింది. కోట్లాది మంది ప్రజలు దీని బారిన పడగా.. లక్షలాది

Updated : 18 Feb 2022 15:27 IST

జాబితా విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

ఇంటర్నెట్‌డెస్క్‌: గత రెండేళ్లుగా యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేసింది. అనేక దేశాల్లో వైరస్‌ విలయతాండవం చేసింది. కోట్లాది మంది ప్రజలు దీని బారిన పడగా.. లక్షలాది మంది బలయ్యారు. ముఖ్యంగా యూఎస్‌, ఐరోపా దేశాల్లో వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇప్పటికీ కరోనా గాలి సోకని దేశాలూ లేకపోలేదు. అవి చాలా తక్కువ సంఖ్యలోనే అయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వైరస్‌ భయం లేకుండా స్వేచ్ఛగా జీవిస్తుండటం సంతోషకర విషయమే..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా గణాంకాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా విడుదల చేసింది. ఇందులో అత్యధిక కరోనా కేసులతో అగ్రరాజ్యం అమెరికా (7.7కోట్లు) తొలి స్థానంలో ఉండగా.. 4.2 కోట్ల కేసులతో భారత్‌ రెండో స్థానంలో, 2.7 కోట్లతో బ్రెజిల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. వీటిల్లో చాలా వరకు పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహా సముద్రంలోని ద్వీప దేశాలే. వీటికి ఇతర దేశాలతో సరిహద్దులు లేకపోవడమే వైరస్‌ వ్యాపించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కరోనా కేసుల్లేని దేశాలివే..

టువాలు:

ఇది దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని ఓ ద్వీప దేశం. మూడు దిబ్బ దీవులు, ఆరు పగడపు దీవులతో కలిపి ఈ దేశం ఏర్పడింది. టువాలు కామన్వెల్త్‌ సభ్య దేశం కూడా. అయితే కరోనా వైరస్‌ వెలుగు చూడగానే ఈ దేశం తమ సరిహద్దులను పూర్తిగా మూసేసి తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేసింది. దీంతో వైరస్‌ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోగలిగింది. డబ్ల్యూహెచ్‌ఓ డేటా ప్రకారం.. ఇక్కడ 50శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయ్యింది. 

టోకిలౌ: 

దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న పగడపు దీవులతో కలిపి ఏర్పడిన ఈ దేశంలో కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. ఈ దేశం న్యూజిలాండ్‌కు సమీపంలో ఉండగా.. ఒక ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అయితే కరోనా వెలుగులోకి రాగానే ఇక్కడ కఠిన ఆంక్షలు అమలు చేశారు. ఇక్కడ 71.7శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది.

సెయింట్‌ హెలెనా: 

దక్షిణ అట్లాంటిక్‌ సముద్రంలో ఉండే ఈ దేశంలోనూ కరోనా ప్రవేశించలేదు. ఇక్కడ 58.16శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.

పిట్‌కెయిర్న్‌ ఐల్యాండ్స్‌: 

ఈ ద్వీప దేశం పసిఫిక్‌ సముద్రంలో ఉంది. ఇక్కడ ప్రతి 100 మందిలో 74 మంది రెండు డోసుల టీకా పొందినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడించాయి. 

నియూ: 

ఇది కూడా దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ దేశంలో 79శాతం మందికి టీకా పంపిణీ పూర్తయ్యింది. 

నౌరు: 

ఆస్ట్రేలియాకు ఈశాన్యాన ఉండే ఈ ద్వీప దేశం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌ అవుట్‌పోస్ట్‌గా ఉండేది. కరోనా వైరస్‌ ప్రవేశించకుండా ఈ దేశం కూడా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ఇక్కడ దాదాపు 68శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.

మైక్రోనేషియా: 

ఇది కూడా ఆస్ట్రేలియాకు సమీపంలోనే ఉన్న ద్వీప దేశం. ఇక్కడ 38.87శాతం మందికి టీకా పంపిణీ పూర్తయ్యింది. 

ఆ దేశాల్లో అంకెల్లోనే కేసులు..

ఇక వనౌటు, మార్షల్‌ ఐల్యాండ్స్‌, కూక్‌ ఐల్యాండ్స్‌ దేశాల్లో కరోనా కేసులు 10లోపే ఉన్నాయి. కూక్‌ ఐల్యాండ్స్‌లో అయితే గతవారమే తొలి కేసు నమోదైంది. అటు కొన్ని నెలల వరకు టోంగా ద్వీప దేశంలోనూ కరోనా మహమ్మారి జాడ కన్పించలేదు. అయితే ఇటీవల అక్కడ అగ్నిపర్వతం బద్దలై క్లిష్ట పరిస్థితులు ఎదురవడంతో ఇతర దేశాల నుంచి అత్యవసర సరుకులు వెళ్లాయి. ఆ తర్వాతే అక్కడ కేసుల నమోదు మొదలైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. t

అంతుచిక్కని ఆ రెండు దేశాలు..

డబ్ల్యూహెచ్‌ఓ జాబితాలో ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్‌ దేశాల్లోనూ సున్నా కేసులు ఉన్నట్లుగా ఉంది. అయితే ఈ రెండు దేశాల్లో కరోనా మహమ్మారి పరిస్థితిపై బయటి ప్రపంచానికి ఎలాంటి సమాచారం తెలియదు. ఆ దేశాలు కూడా అధికారికంగా వైరస్‌ గణాంకాలను ప్రకటించలేదు. దీంతో ఆ దేశాల్లో వైరస్‌ ప్రభావం ఏ మేరన ఉందనేది అంతుచిక్కడం లేదు. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఉత్తర కొరియా సరిహద్దులను పూర్తిగా మూసేసి కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతున్నా సరే.. కిమ్‌ సర్కారు ఆంక్షలను సడలించేందుకు ఇష్టపడట్లేదు. మరోవైపు ఉత్తరకొరియాలో ఆకలి కేకలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని