mpox: మంకీపాక్స్‌ పేరు ఇకపై ఎమ్‌పాక్స్‌!

మంకీపాక్స్‌ పేరును ఎమ్‌పాక్స్‌గా మారుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. పలు దేశాల నుంచి విజ్ఞప్తులు రావడంతోపాటు నిపుణుల సూచన మేరకు పేరును మార్చినట్లు తెలుస్తోంది.

Published : 28 Nov 2022 21:58 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతోన్న సమయంలోనే.. మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ కూడా పలు దేశాలను వెంటాడింది. ఇప్పటివరకు 100కుపైగా దేశాలకు వ్యాపించడంతోపాటు 80వేల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ దీనిని మంకీపాక్స్‌ అని పిలవడంపై నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత చూపించేలా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో మంకీపాక్స్‌ పేరును ఎమ్‌పాక్స్‌ (mpox)గా మార్చుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. వచ్చే ఏడాది వరకు రెండు పేర్లతో పిలవవచ్చని.. పాత పేరు దశల వారీగా తొలగించనున్నట్లు వెల్లడించింది.

మంకీపాక్స్‌ వైరస్‌ను 1958లో తొలుత కోతుల్లో గుర్తించిన రెండు దశాబ్దాల తర్వాత (1970లో) కాంగోకు చెందిన ఓ బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్‌ కేసు కూడా అదే. అప్పటినుంచి పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ ప్రాబల్యం అధికంగా కొనసాగింది. కానీ, ఈ ఏడాది విస్తృతంగా వ్యాపించి దాదాపు 100పైగా దేశాలకు విస్తరించింది. యూరప్‌, అమెరికాల్లోనే కేసులు అధికంగా నమోదయ్యాయి. అయినప్పటికీ దీన్ని ఆఫ్రికాకు చెందినట్లుగా పిలవడాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టారు. యూరప్‌లో కేసులు విస్తృతంగా బయటపడుతున్నప్పటికీ గతంలో ఆఫ్రికన్‌ బాధితుల ఫొటోలను మాత్రమే విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసింది. ఈ వైరస్‌ ఒక ప్రాంతానికి చెందినదిగా పేర్కొనడం సమంజసం కాదని.. వివక్షత లేని పేరును సూచించాలని అందులో పేర్కొంది. వాటిని పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌ఓ.. దీని పేరు మార్పుపై తాజాగా ప్రకటన చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని