WHO: ఒక్క భారత్‌లోనే 47 లక్షల కొవిడ్‌ మరణాలు.. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికను తప్పుబట్టిన భారత్‌

కొవిడ్‌ కారణంగా నేరుగా లేదా ఆరోగ్య వ్యవస్థపై అది చూపిన ప్రభావం వల్ల గడిచిన రెండేళ్లలో కోటి 50లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.

Published : 05 May 2022 22:56 IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న విలయంతో దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ సమయంలో కొవిడ్‌ కారణంగా నేరుగా లేదా ఆరోగ్య వ్యవస్థపై అది చూపిన ప్రభావం వల్ల గడిచిన రెండేళ్లలో కోటీ 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. అధికారికంగా ఇప్పటివరకు చెబుతున్న 62 లక్షల మరణాల కంటే రెండురెట్లు ఎక్కువ ఉండవచ్చని అంచనా వేసింది. వీటిలో ఎక్కువ మరణాలు ఆగ్నేయాసియా, యూరప్‌, ఆమెరికా దేశాల్లోనే సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కేవలం ఒక్క భారత్‌లోనే 47 లక్షల కొవిడ్‌ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొనగా.. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికను భారత ప్రభుత్వం తప్పుబట్టింది.

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య వాస్తవానికంటే ఎక్కవుగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 2020, డిసెంబర్‌ 2021 మధ్యకాలంలో కొవిడ్‌ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు వేసింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా కోటి 50లక్షల మంది మరణించగా కేవలం ఒక్క భారత్‌లోనే 47లక్షల మరణాలు సంభవించవచ్చని లెక్కగట్టింది. అయితే, వీటిలో నేరుగా కొవిడ్‌తో ఎంతమంది మరణించారు, ఆరోగ్య వ్యవస్థపై చూపిన ప్రభావంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే గణాంకాలను వెల్లడించలేదు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలపైనా స్పష్టత కరవైంది.

వ్యతిరేకించిన భారత్‌..

భారత్‌లో కొవిడ్‌ కారణంగా 47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించడాన్ని భారత్‌ తప్పుబట్టింది. వీటికి సంబంధించిన ప్రామాణిక సమాచారంతో పాటు అదనపు మరణాలను అంచనా వేయడానికి అనుసరించిన గణిత నమూనాను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. డేటా సేకరణతోపాటు గణాంక పద్ధతి చెల్లుబాటును ప్రశ్నించింది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన సమాచారాన్ని ఆయా వెబ్‌సైట్ల నుంచి పొందడంతోపాటు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటికి సంబంధించి ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక విడుదల చేయడాన్ని తప్పుబడుతూ కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని