Corona Pandemic: ‘ఎండెమిక్‌’ దశకు చాలా దూరంలో ఉన్నాం : WHO

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఎండెమిక్‌ (స్థానికంగా వ్యాప్తి చెందే) దశకు చేరుకునేందుకు చాలా దూరంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Published : 16 Apr 2022 01:54 IST

మరోసారి అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఎండెమిక్‌ (స్థానికంగా వ్యాప్తి చెందే) దశకు చేరుకునేందుకు చాలా దూరంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇటువంటి సమయంలో మరిన్ని విజృంభణలకు ఇది కారణమవుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ వైరస్‌ ఎండెమిక్‌ (Endemic) దశకు చేరుకొని స్థానికంగా స్థిరపడడం కూడా సమస్యకు ముగింపు అని భావించడం కూడా తప్పేనని స్పష్టం చేసింది.

‘కరోనా వైరస్‌ ఎండెమిక్‌ దశకు ఇప్పట్లో చేరుకుంటుందని భావించడం లేదు. ఇప్పటివరకు ఏ ఒక్క సీజన్‌కో లేదా ఒకరకమైన వ్యాప్తి నమూనాకు పరిమితం కాలేదు. చాలా అస్థిరత, భారీ అంటు వ్యాధులు కలిగించే సామర్థ్యం మహమ్మారికి ఉంది. ఇప్పటికీ ఇంకా ఇది ఎండెమిక్‌ వ్యాధి కాదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం డైరెక్టర్‌ మైక్‌ రేయాన్‌ పేర్కొన్నారు. క్షయ, మలేరియా వంటివి ఎండెమిక్‌గా (స్థానిక వ్యాప్తిగా) మారినప్పటికీ వాటి బారినపడి ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కరోనా వైరస్‌ భారీ స్థాయిలో వ్యాప్తిలో ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్‌ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌.. పెద్ద ఎత్తున మరణాలు, వినాశనానికి కారణమవుతూనే ఉందన్నారు. ప్రతివారం లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులతో పాటు దాదాపు 20వేల మరణాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అంతేకాకుండా కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తోందన్న కెర్ఖోవ్‌.. మహమ్మారి ప్రాబల్యంపై ప్రపంచ దేశాలు అప్రమత్తం ఉండాలని సూచించారు.

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోకి వస్తున్నట్లు భావించినప్పటికీ పలు ప్రాంతాల్లో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలతో పాటు చైనాలోనూ భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని