WHO: ప్రమాదకరంగా మారుతున్న వైద్య వ్యర్థాలు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

కరోనా నేపథ్యంలో ఉపయోగించిన వైద్య పరికరాలు వైద్య వ్యర్థాలుగా మారి జీవరాశికి హాని కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులు పీపీఈ కిట్లు, చేతి గ్లౌజు

Published : 07 Feb 2022 01:43 IST

న్యూయార్క్‌: కరోనా నేపథ్యంలో ఉపయోగించిన వైద్య పరికరాలు వైద్య వ్యర్థాలుగా మారి జీవరాశికి హాని కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులు పీపీఈ కిట్లు, చేతి గ్లౌజులు, ఇంజక్షన్లు తదితర వస్తువులను భారీ మొత్తంలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వాటిని వాడి పడేస్తుండటంతో అవి కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసింది.

2020 మార్చి నుంచి 2021 నవంబర్‌ వరకు కరోనా కట్టడిలో భాగంగా వినియోగించిన పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్‌ కిట్లు, చేతి గ్లౌజులు ఇతర వైద్య పరికరాలు ఇప్పుడు 87 వేల టన్నుల వ్యర్థాలుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వగా.. సిరంజీలు, సూదులు, టీకా మందు ఖాళీ సీసాలు, దూది... తదితర రూపాల్లో వైద్య వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. అలా మరో 143 టన్నుల వైద్య వ్యర్థాలు అదనంగా పోగయ్యాయి. ఈ వైద్య వ్యర్థాల లెక్క కేవలం ఐక్యరాజ్య సమితి సమక్షంలో పంపిణీ చేసిన వైద్య పరికరాలకు సంబంధించిన వ్యర్థాలు మాత్రమే. ఇక ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు ఉపయోగించిన లెక్కకి రాని వ్యర్థాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

ఈ వైద్య వ్యర్థాల వల్ల పర్యావరణం కలుషితమై మనుషులు ప్రమాదంలో పడుతున్నారని, కరోనాతోపాటు ఇతర వ్యాధులు సోకే అవకాశముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. ఈ సమస్యపై పోరాటం చేసేందుకు ‘ఎకో ఫ్రెండ్లీ’ వైద్య ఉత్పత్తులను వినియోగించాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. వైద్య వ్యర్థాలను రీసైకిల్‌ చేయడంపై ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టాలని కోరింది. ‘‘కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు తప్పనిసరిగా ధరించాల్సిందే. అయితే, అవి పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలి’’ అని డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీస్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని