Updated : 08 Aug 2022 14:15 IST

China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!

సొంత ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

దక్షిణ చైనా సముద్రంలో నాలుగు రోజులపాటు లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ పేరిట డ్రాగన్‌ చేసిన హడావుడి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే తైవాన్‌ ఆర్థిక వ్యవస్థను ఉక్కిబిక్కిరి చేసేలా యుద్ధ విన్యాసాలను చేసినట్లు డ్రాగన్‌ సంబరపడుతోంది. భవిష్యత్తులో తరచూ నిర్వహిస్తామని కూడా చెబుతోంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా తైవాన్‌  జల సంధి సంక్షోభం కూడా తోడైతే.. అది చైనా ఆర్థిక వ్యవస్థపై  భస్మాసుర హస్తం వలే పరిణమించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

ప్రమాదకరంగా షిప్పింగ్‌..

తైవాన్‌ వద్ద డ్రాగన్‌ లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ చేపట్టింది. అంటే యుద్ధంలో వాడే నిజమైన ఆయుధాలతో యుద్ధవిన్యాసాలు చేయడమన్నమాట. అంటే ఆ మార్గంలో ప్రయాణించడం నౌకలకు మృత్యువుతో సమానం. ఈ క్రమంలో ఉత్తర ఆసియా నుంచి వచ్చే డజన్ల కొద్దీ నౌకలు గత కొన్ని రోజులుగా మార్గం మార్చుకోవడం గానీ, ప్రయాణాన్ని ఆలస్యం చేయడం గానీ చేస్తున్నాయి. తైవాన్‌, ఆ ద్వీపం తూర్పు మార్గంలో సాధారణంగా నిత్యం 240 నౌకలు వెళతాయి. ఈ క్రమంలో అవి మార్గం ముందు ప్రమాదం లేదని నిర్ధారించుకొన్న తర్వాతే.. కదలాల్సిన పరిస్థితి.

తైవాన్‌ను అడ్డుకోగానే సంబరం కాదు..

చైనా శక్తి ప్రదర్శన నిర్వహించి.. తైవాన్‌ వాయు, సముద్ర మార్గాలను ఎంత తేలిగ్గా చుట్టుముట్టగలదో ప్రపంచానికి చూపించింది. కానీ, అదే సమయంలో ఆ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై అంతే పెనుభారంగా మారతాయనే విషయాన్ని మర్చిపోయింది. వాస్తవానికి చైనా బ్లాకేడ్‌ను తైవాన్‌ జలసంధిలో అమెరికా నౌకలు సవాలు చేస్తే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. ఆ మార్గంలో వ్యాపారాలు నిర్వహించే సంస్థలు, కంపెనీలకు ఫైనాన్స్‌ లభించడం నిలిచిపోతుంది. షిప్పింగ్‌కు అవసరమైన బీమా ధరలు  పెరగడం గానీ, అసలు లభించకపోవడంగానీ చోటు చేసుకొంటుంది. తైవాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొనే ఉద్రిక్తతలు చైనా ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం చూపిస్తాయి. చైనా ప్రధాన నౌకాశ్రయాలైన షాంఘై, డాలియన్‌, తియాన్‌జిన్‌లు.. ప్రధానంగా తైవాన్‌ సమీప జలాల్లో నుంచి జరిగే వ్యాపారంపై ఆధారపడ్డాయి. దక్షిణ కొరియా, జపాన్‌, చైనాలు తైవాన్‌ జలసంధిపై ఆధారపడ్డాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి అమెరికాకు వెళ్లడానికి ఇది ప్రధాన మార్గంగా ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఉత్తరచైనాలోని ప్రధాన రేవులకు వెళ్లే ముడి ఇనుము తైవాన్‌ జలాలను దాటాల్సిందే.

ప్రత్యామ్నాయ మార్గంలో తుపాన్ల ముప్పు..

బ్లూమ్‌బెర్గ్‌ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో ప్రపంచంలోని కంటైనర్‌ షిప్పుల్లో సగానికి పైగా తైవాన్‌ జలసంధిని దాటాయి. ఇక ఈ మార్గంలో నిత్యం మిలియన్‌ డాలర్ల చమురును ట్యాంకర్లు తరలిస్తున్నాయి. 130 కిలోమీటర్ల వెడల్పైన తైవాన్‌ జలసంధికి ప్రత్యామ్నాయంగా తూర్పు తైవాన్‌ వైపు నుంచి లూజోన్‌ జలసంధి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తరచూ తుపాన్లు వస్తుండటం నౌకలకు ఇబ్బందికరంగా మారుతుంది.

తైవాన్‌ వాయు మార్గాల మూసివేత ప్రభావం..

తైవాన్‌ ప్రపంచ వ్యాప్తంగా సెమీకండెక్టర్లలో 60శాతానికి పైగా తయారు చేస్తుంది. ఈ దేశానికి చెందిన అత్యధిక ఉత్పత్తులను విమానాల ద్వారానే రవాణా చేస్తారు. చైనా తయారు చేసే చాలా ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కూడా ఇక్కడి నుంచే చిప్స్‌ వెళ్లాలి. తాజా సంక్షోభంతో వాటికి కూడా ఆటంకాలు తలెత్తాయి. మరోవైపు తైవాన్‌ వద్ద సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అమెరికా సెనెట్‌ ఈ వారం సెమీకండెక్టర్ల తయారీకి 280 బిలియన్‌ డాలర్ల మద్దతును అనుమతించింది. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ కూడా అమెరికాలోని అరిజోనాలో 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది.

అది చైనా వల్లకాదు..

తైవాన్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండెక్టర్‌ పరిశ్రమ టీఎస్‌ఎంసీను చైనా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేదని ఆ సంస్థ ఛైర్మన్‌ మార్క్‌ ల్యూ గత వారం తెలిపారు.  చైనా దళాలు టీఎస్‌ఎంసీని బలవంతంగా ఆక్రమించుకొన్నా దానిని నిర్వహించలేరన్నారు. ఈ ఫ్యాక్టరీ బాహ్యప్రపంచంలోని ఐరోపా, జపాన్‌, అమెరికా వంటి దేశాలపై పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో చిప్స్‌ తయారీలో అవరోధాలు తలెత్తితే ప్రపంచంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. హాంకాంగ్‌కు చెందిన హిన్‌రిచ్‌ ఫౌండేషన్‌ ప్రకారం క్రూడ్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌, ఆటో మొబైల్స్‌ తర్వాత అత్యధికంగా ట్రేడ్‌ అయ్యేవి సెమీకండెక్టర్లే. ఈ నేపథ్యంలో తైవాన్‌ జలసంధిలో తలెత్తే సంక్షోభ ప్రభావం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని