Afghanistan Earthquakes: భూకంపాలు అక్కడ సర్వసాధారణం..!

భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, లద్ధాఖ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, తజకిస్థాన్‌లు తరచూ భూమాత ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. ఇక్కడ వచ్చే పెనుభూకంపాలకు ఏటా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Published : 25 Jun 2022 01:29 IST

 అఫ్గాన్‌, భారత్‌, పాక్‌లకు శాపం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌తో పాటు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, తజకిస్థాన్‌ తరచూ భూమాత ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. ఇక్కడ వచ్చే పెను భూకంపాలకు ఏటా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా వీటికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఏ క్షణాన కాళ్ల కింద నేల కదిలిపోతుందా.. అంటూ భయం భయంగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి నెలా భారీ సంఖ్యలో స్వల్ప భూకంపాలు నమోదవుతుంటాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

హిందు కుష్‌ జోన్‌ భూగర్భంలోనే సమస్య..

సాధారణంగా భూకంపాలు ఆసియా ఖండంలో ఎక్కువగానే వస్తుంటాయి. అందులోనూ భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌తో పాటు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, తజకిస్థాన్‌లు హింద్‌ కుష్‌ హిమాలయాన్‌ జోన్‌కు చుట్టుపక్కల ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఇది కూడా ఒకటి. ఇక్కడ భారత ఉపఖండ భూఫలకం యూరేషియా భూఫలకంతో ఢీకొనడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెలలోనే 22 రోజుల్లో అక్కడ 35 స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే మే 9 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 100 భూకంపాలను ది నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ సెస్మాలజీ గుర్తించింది. వీటిల్లో 36 భూకంపాలు అఫ్గానిస్థాన్‌లోనే నమోదయ్యాయి. కానీ, ఆరు సార్లు మాత్రమే వీటి తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5 కంటే ఎక్కువగా నమోదైంది. చాలా వరకు భూకంపాలు వచ్చినట్లు కూడా మనకు తెలియదు. అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) ప్రకారం హింద్‌ కుష్‌ ప్రాంతంలో భూమికి అత్యధిక లోతుల్లో ఎక్కువగా ప్రకంపనలు వస్తుంటాయి.

భూఫలకాల నిరంతర కదలికలు..

భూమిలో మొత్తం మీద ఏడు ప్రధాన ఫలకాలు ఉన్నాయి. పసిఫిక్‌ ప్లేట్‌, నార్త్‌అమెరికన్‌ ప్లేట్‌, యూరేషియన్‌ ప్లేట్‌, ఆఫ్రికన్‌ ప్లేట్‌, అంటార్కిటిక్‌ ప్లేట్‌, ఇండో-ఆస్ట్రేలియన్‌ ప్లేట్‌, సౌత్‌ అమెరికన్‌ ప్లేట్లు ఉన్నాయి. ఇండో-ఆస్ట్రేలియన్‌ ప్లేట్‌లో భారత్‌ భాగం. ఇవి నిరంతరం కదులుతుంటాయి. వీటి కదలికల ఆధారంగా పర్వతాలు, అగాధాలు వంటి భౌగోళిక పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ కదలికల సమయంలో పెరిగిన ఒత్తిడి అత్యంత శక్తితో విడుదలై.. భూకంపాలకు కారణమవుతుంది.  ఇక భారత ఉపఖండ భూఫలకం నిరంతరం యూరేషియా భూఫలకంలోకి చొచ్చుకు వెళుతోంది. దాని చుట్టుపక్కల హిందు కుష్‌ పర్వతాలు, హిమాలయాలు ఉన్నాయి. సాధారణ భూ ఫలకాల రాపిడి కంటే ఇండియన్‌-యూరేషియన్‌ ఫలకాల కదలికలు 10రెట్లు వేగంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి. 2005లో 7.6 తీవ్రతతో కశ్మీర్‌లో వచ్చిన భూకంపానికి 87,000 మంది చనిపోగా.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇక 2015లో 8.1 తీవ్రతతో నేపాల్‌లో వచ్చిన భూకంపానికి దాదాపు 9,000 మంది మరణించారు.

భారత్‌లో హిమాలయాలు విస్తరించిన రాష్ట్రాల్లో భూకంపాల రిస్క్‌ అత్యధికంగా ఉంటుంది. ఈ రాష్ట్రాలు అత్యంత ప్రమాదకరమైన జోన్‌-వి కేటగిరిలో ఉన్నాయి. మన దేశంలో మొత్తంగా జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌, ఉత్తర బిహార్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు ఈ కేటగిరీ కిందకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని