Tornado : అమెరికాపై టోర్నడోల విజృంభణ.. ఎందుకంటే..!
గత నెల రోజులుగా అమెరికాలోని (America) పలు రాష్ట్రాలపై టోర్నడోలు (Tornadoes) విరుచుకుపడుతున్నాయి. ఆర్కన్సాస్, ఇల్లినాయిస్, ఇండియానా, అలబామా, మిసిసిపీ, టెనెసీ రాష్ట్రాల ప్రజలు భారీ నష్టాన్ని చవి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు టోర్నడో (Tornado) అంటే ఏంటి? అవి అగ్రరాజ్యంలోనే ఎందుకు వస్తున్నాయో తెలుసుకోండి.
అమెరికాలో (America) ఏటా దాదాపు 1150 టోర్నడోలు (Tornadoes) వస్తున్నాయి. ప్రపంచం (World) మొత్తం మీద ఇన్ని టోర్నడోలు మరే దేశంలో కనిపించవు. కెనడా (Canada), ఆస్ట్రేలియా (Australia), బంగ్లాదేశ్ (Bangladesh), ఐరోపా దేశాలన్నీ (European countries) కలిసినా ఈ స్థాయిలో విధ్వంసం చవిచూడవు. యూఎస్‌లోని (United States) ప్రతి రాష్ట్రం ఏటా ఒక్క టోర్నడోనైనా ఎదుర్కొంటోంది. కొన్ని రాష్ట్రాలపై డజన్ల కొద్దీ టోర్నడోలు విరుచుకుపడిన సందర్భాలూ ఉన్నాయి. అమెరికాలో ఏటా టోర్నడోల కారణంగా సగటున 73 మంది మరణిస్తున్నట్లు సమాచారం.
ఏంటీ టోర్నడో?
టోర్నడో ఒక భీకరమైన సుడిగాలి అని చెప్పవచ్చు. టోర్నడోలను ట్విస్టర్, సుడిగాలి, తీవ్రమైన గాలి తుపాను అని పిలుస్తుంటారు. ఇవి వివిధ పరిమాణాలు, ఆకారాల్లో.. ఉరుములు, మెరుపులను కలిగించే మేఘాల్లో (థండర్ క్లౌడ్స్) ఏర్పడుతుంటాయి. ఎక్కువగా గరాటు ఆకారంలో కన్పిస్తూ నేల వరకు చేరుకోగలవు. క్యుములోనింబస్ మేఘాలు, మేఘాల కింద తిరిగే వ్యర్థాలు, ధూళి కణాలు నుంచి టోర్నడోలు ఉద్భవిస్తాయి. టోర్నడోలు చాలా వరకు గంటకు 180 కిలోమీటర్ల లోపు గాలులతో.. 250 అడుగుల వరకు వైశాల్యంతో ఉంటాయి. ప్రారంభ స్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అవి గంటకు 480 కిలోమీటర్ల వేగంతోనూ విజృంభించే అవకాశం ఉంటుంది. వైశాల్యం మూడు కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అలా ఏకబిగిన 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. టోర్నడో ఏనుగు తొండం ఆకారంలా గాలి సుడులు తిరుగుతూ మధ్యలో తక్కువ పీడనం కలిగి ఉంటుంది. ఇది ప్రయాణించిన మార్గం మొత్తం విధ్వంసం సృష్టిస్తుంది.
మధ్య అక్షాంశాల వద్ద టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయి. ఉత్తర, దక్షిణార్థ గోళాల్లో ఉరుములతో కూడిన గాలివానలు వచ్చినప్పుడు, వసంత, వేసవి కాలాల్లో టోర్నడోల ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. ఈ గాలి తుపానులు సంభావ్య, ఉష్ణశక్తిని గతి శక్తిగా మారుస్తాయి. టోర్నడోలు ప్రయాణించే దిశ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కేవలం సెకన్ల వ్యవధిలోనే మారుతుంది. సాధారణంగా అవి నైరుతి నుంచి ఈశాన్యానికి అస్థిరంగా కదులుతుంటాయి. సముద్రంపైన టోర్నడో ఏర్పడితే దాన్ని ‘వాటర్ స్పౌట్’ అని పిలుస్తారు.
ఎలా ఏర్పడతాయి?
టోర్నడోలు అసాధారణ స్థాయి వేడి ఉన్నప్పుడు ఏర్పడతాయి. నేలపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి వేడెక్కి పైకి లేస్తుంది. ఇది ఎగువన ఉన్న చల్లటి, పొడి పవనాలను తాకినప్పడు థండర్ క్లౌడ్స్ ఏర్పడుతుంటాయి. దీన్ని ‘వాతావరణ అస్థిరత’గా అభివర్ణిస్తుంటారు. అది జరిగినప్పుడు గాలిపైకి కదలడం మొదలుపెడుతుంది. దీన్ని ‘అప్‌డ్రాఫ్ట్’ అంటారు. విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పుల (విండ్ షియర్) కారణంగా ఈ అప్‌డ్రాఫ్ట్ సుడి తిరగడం మొదలవుతుంది. దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఈ వైరుధ్యం గణనీయ స్థాయిలో ఉన్నప్పుడు.. టోర్నడోను కలిగించే సూపర్‌సెల్ థండర్ క్లౌడ్స్ ఏర్పడతాయి. శీతాకాలంలో గాలిలో పెద్దగా వేడి, తేమ ఉండదు కాబట్టి టోర్నడోలకు అవసరమైన స్థాయిలో అస్థిరతకు తావుండదు.
ఈ రాష్ట్రాల్లోనే అధికం
టెక్సాస్ రాష్ట్రం ఏడాదికి సుమారు 140 టోర్నడోలను ఎదుర్కొంటోంది. కేన్సస్, ఫ్లోరిడా, ఓక్లహామా, నెబ్రాస్కాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలబామా వంటి రాష్ట్రాల్లో టోర్నడోలు తక్కువగా వచ్చినా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అందుకు కారణం సరైన సన్నద్ధత లేకపోవడమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. టోర్నడో వచ్చే సమయం, ప్రదేశాన్ని బట్టి దాని తీవ్రత మారుతూ ఉంటుంది. అలబామా రాష్ట్రంలో ఎక్కువగా చెట్లు, కొండలు, పీఠభూములు ఉన్నాయి. కేన్సాస్, టెక్సాస్, నెబ్రాస్కా రాష్ట్రాలు మైదాన ప్రాంతాలు. దాంతో కొన్ని మైళ్ల దూరం నుంచే టోర్నడో వస్తోందని ఇక్కడి ప్రజలు గుర్తించగలుగుతున్నారు. ఫలితంగా తమను తాము రక్షించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది. దక్షిణాది రాష్ట్రాలైన టెనెసీ, ఆర్కన్సాస్, కెంటకీల్లో టోర్నోడోలు రాత్రి పూట వస్తున్నాయి. వీటిని ‘నొక్టర్నల్ టోర్నడోలు’ అని పిలుస్తారు. చెక్క ఇళ్లు కావడం, రాత్రుళ్లు ప్రజలు నిద్రలో ఉండటం, బయట ఏం జరుగుతుందో తెలియని కారణంగా మరణాల శాతం పెరుగుతోంది. ఇక ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే టోర్నడోల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ, భౌగోళిక పరమైన కారణాల వల్ల ఇక్కడ టోర్నడోల విజృంభణ అధికంగా ఉంటోందని సమాచారం.
అనువైన వాతావరణం
అమెరికాలోని అన్ని రాష్ట్రాలు టోర్నడోలు ఏర్పడటానికి అనువైన వాతావరణం కలిగి ఉన్నాయి. ఇవి సాపేక్షంగా చదునైన భూభాగంతో అతిపెద్ద సెంట్రల్ కోర్ కలిగి ఉన్నాయి. గొప్ప మైదానాలు, మిస్సిసిపీ నదీలోయతో కూడిన ప్రాంతం దాదాపు మూడింట ఒక వంతు విస్తీర్ణంలో ఉంది. విస్తారమైన గడ్డి భూములు, పొలాలు చాలా త్వరగా వేడెక్కుతాయి. దాంతో లోపలి నుంచి వెచ్చని గాలి పుడుతోంది. ఈ ప్రాంతాలకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ నుంచి తేమ వస్తుంది. అపారమైన వృక్ష సంపద నుంచి కూడా తేమ విడుదల అవుతుంది. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఎగువ మైదానాలు, కెనడా నుంచి చల్లగాలి వీస్తుంది. రాకీ పర్వతాలు, నైరుతిలోని ఎత్తయిన ఎడారుల నుంచి పొడి గాలి వీస్తుంది. ఈ కారకాలన్నీ తరచూ తీవ్రమైన ఉరుములతో కూడిన తుపానులు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. అవే టోర్నడోల పుట్టుకకు కారణమవుతున్నాయి.
రెండో స్థానంలో కెనడా
కేవలం అమెరికాలోనే కాకుండా జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, తూర్పు చైనా, జపాన్, బంగ్లాదేశ్, అర్జెంటీనా దేశాల్లో టోర్నడోలు ఎక్కువగా వస్తున్నాయి. అమెరికాలో 2011-2020 మధ్యకాలంలో ఏడాదికి 1173 టోర్నడోలు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ మొత్తం కలిపినా ఆ సంఖ్య 256 మాత్రమే. స్వల్ప తీవ్రతతో వచ్చే టోర్నడోలను లెక్కించకపోవడంతో కూడా ఐరోపాలో సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే అమెరికాలో వసంత కాలంలో టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయి. మధ్య, ఉత్తర ఐరోపాలో వేసవి కాలం టోర్నడోలకు అనువైన వాతావరణం ఉంటుంది. అమెరికా తరువాత కెనడాలో అత్యధిక టోర్నడోలు సంభవిస్తాయి. ఏటా అక్కడ 100 టోర్నడోలు వస్తున్నట్లు సమాచారం. ఒక్క అంటార్కిటికాపై తప్ప మిగిలిన అన్ని ఖండాల్లోనూ టోర్నడోలు సంభవిస్తుంటాయి.
టోర్నడోల ప్రాముఖ్యత
టోర్నడో వస్తే విధ్వంసం మాత్రమే జరుగుతుందని అనుకోవద్దు. అనేక రకాలుగా అది ప్రకృతికి మేలు చేస్తుంది. టోర్నడో కారణంగా భూమికి కావాల్సిన నత్రజని, చెట్లకు కావాల్సిన నీరు అందుతుంది. టోర్నడో వచ్చిన సమయం, పరిమాణం బట్టి అది గాలిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలిస్తుంటుంది. విత్తనాల పరాగ సంపర్కానికి టోర్నడోలు దోహదం చేస్తాయి. పురాతన, శిథిలమైన చెట్లను ఇవి నేల కూల్చుతాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై